YSRCP Government Irregularities: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న వైనం బయటపడింది. పార్టీ అవసరాలకు పని చేయించుకుని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చిన గుట్టు రట్టవుతోంది.
ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డవల్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వందల సంఖ్యలో పెద్ద ఎత్తున నియామకాలు చేసింది. 5 ఏళ్లు కార్యాలయానికి రాకుండానే చాలా మందికి జీతాలు చెల్లించారు. ప్రభుత్వ నుంచి జీతం ఇస్తూనే, పార్టీ కోసం సోషల్ మీడియాలో పని చేయించుకున్నారు. తప్పుడు రిపోర్టులు, రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల నుంచి జీతాలు చెల్లించారు.
సాక్షి ఉద్యోగులు, కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నాటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై సమగ్ర వివరాలను కూటమి ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ కోసం పని చేసిన వారికి ప్రభుత్వం నుంచి జీతాల చెల్లింపు చేశారని వెల్లడైనట్లు తెలుస్తోంది. అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గోరంత అనుమతితో కొండంత గ్రావెల్ తవ్వకాలు - లెక్కలు తేలుస్తున్న అధికారులు - Gravel Mining