YSRCP Government did not Pay Bills to Contractors : మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రహదారుల విస్తరణ కాదు కదా కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. ఫలితంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమై ప్రజలు ఐదేళ్లు నరకం చూశారు. మరోవైపు వర్షాలకు ఘోరంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేసిన గుత్తేదారులకు కూడా బిల్లులు ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్ కాకుండా కూడా చేసింది. గుంతలు పూడ్చిన గుత్తేదారులకే రూ.668 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక రహదారి విస్తరణ పనులు చేసిన గుత్తేదారుల బాధలైతే వర్ణనాతీతం. వారికి ప్రభుత్వం రూ.1,791 కోట్లు చెల్లించాల్సి ఉంది.
భారీగా నిధులు ఇస్తేనే : ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రహదారుల మరమ్మతులకు రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో గుంతలు పూడ్చే పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం 7,092 కి.మీ.ల్లో గుంతలు పూడ్చి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలంటే రూ.283 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనా వేశారు. అయితే రాష్ట్ర, జిల్లా రహదారుల్లో మరమ్మతులకు సంబంధించి గత ఏడాదికి చెందిన స్పిల్‌ఓవర్ రూ.600 కోట్లు ఉన్నాయి.
అంటే ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌లో మరమ్మతులకు కనీసం రూ.600 కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజినీర్లు రూ.900 కోట్ల వరకు (ఒకటిన్నర రెట్లు) పనులు మంజూరు చేసేందుకు వీలుంటుంది. వాటితో స్పిల్ ఓవర్ రూ.600 కోట్ల పనులతో పాటు, కొత్తగా అంచనా వేసిన రూ.283 కోట్ల పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఆర్‌అండ్‌బీ అధికారులతో చంద్రబాబు సమీక్ష : రాష్ట్రంలో రహదారులన్నీ అభివృద్ధి చేస్తామని, గుంతలు లేకుండా చేస్తామని ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వం గుంతల రోడ్లపై దృష్టి పెట్టి, అంచనాలు రూపొందించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆర్‌అండ్‌బీ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. గుంతల రోడ్లు, రహదారుల విస్తరణ, ఎన్‌డీబీ ప్రాజెక్ట్, హై ఇంపాక్ట్ రోడ్లు, కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్లు తదితరాలు అన్నింటిపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.