Drinking Water Problem in Pedana : కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సముద్రతీర గ్రామాలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ బోరు తవ్వినా ఉప్పు నీరే వస్తుంది. గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు తంటాలు పడేవారు. ముఖ్యంగా బంటుమిల్లి మండలంలోని 15 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం నిత్యం పోరాటం చేసేవారు. ప్రజల బాధలను తొలగించేందుకు 1994లో అప్పటి ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో తాగునీటి పథకాన్ని మంజూరు చేయించారు.
దీని కోసం మల్లేశ్వరం, చిన పాండ్రాక పంచాయతీల మధ్యలో 18 ఎకరాలను కేటాయించారు. ఈ 18 ఎకరాల్లో పంపుల చెరువు తవ్వించి రక్షిత మంచినీటిని అందించారు. ఇక్కడి నుంచే 15 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేవారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని సముద్రతీర గ్రామాలకూ ఈ చెరువే ఆధారం. వైఎస్సార్సీపీ పాలనలో ఈ పథకాన్ని అటకెక్కించడంతో తాగునీరు అందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏళ్ల తరబడి నిర్వహణ లోపం కారణంగా మురుగు నీరు సరఫరా అవుతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో చెరువులో పూడిక తీయాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల పూడిక పేరుకుపోయింది. అరకొరగా మురుగు నీరు వస్తుండటంతో ప్రజలెవ్వరూ ఈ నీటిని తాగడం లేదు. ఈ చెరువు పక్కనే మరో 15 ఎకరాల్లో రూ. 15 కోట్లతో మరో చెరువు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధి హామీ పథకం కింద చెరువు తవ్వకం పనులు సైతం చేపట్టారు. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
వజ్రకరూరులో నీటి సంక్షోభం - పరిష్కారం కోసం రోడ్డెక్కిన మహిళలు - Women Protest highway
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పల హారిక రెండు ఫిల్టర్ బెడ్లకు మరమ్మతులు చేయించారు. అయినా నీరు దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. రెండు మండలాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్న ఈ మంచినీటి చెరువు సమస్యపై గత పాలకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఆర్ధం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.
బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ఈ చెరువు నీరు దాదాపు 50 నుంచి 60 వేల మందికి అందుతుంది. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఈ చెరువు పరిస్థితిని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో ఈ చెరును అభివృద్ది చేయడంతో పాటు కొత్త చెరువు నిర్మాణం చేస్తామని ఎన్టీఏ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వమైనా రెండు చెరువులను అభివృద్ధి చేసి తాగునీరు అందించాలని కోరుతున్నారు.
విజయవాడ వాసుల నీటి వ్యధ - అయిదేళ్లూ మొద్దు నిద్రలోనే జగన్ సర్కార్! - Drinking Water problem