YSRCP Gadapa Gadapaku Mana Prabhutvam Program: ముఖ్యమంత్రి జగన్‌కేమో తాడేపల్లిలో రాజప్రాసాదం. పేదల గుడిసెలు తొలగించి మరీ ఆ రాజ ప్రాసాదానికి రహదారి నిర్మాణం. ఇంటి నుంచి కదిలితే రెండు హెలికాప్టర్లు, మాటల్లో వర్ణించలేనన్ని రాజభోగాలు. మరి జగన్‌కు ఓట్లేసిన జనానికి మాత్రం నిత్యం అవస్థలు, అడుగడుగునా సమస్యలు.
నాలుగేళ్ల పాటు గ్రామాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన సీఎం జగన్‌కు, ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా ప్రజలు మళ్లీ గుర్తొచ్చారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం' అనే కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టారు. సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు.
ఈ నిధులైనా విడుదల చేశారా? పనులు పూర్తి చేయించారా? అంటే 3 వేల కోట్లకుపైగా విలువైన పనుల్లో మొదలైనవి 1,000 కోట్ల పనులే. వీటిలోనూ పూర్తయిన పనులకు 100 కోట్ల రూపాయలకుపైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. సచివాలయానికి 20 లక్షలు కూడా సరిగా ఇవ్వలేని సీఎం జగన్ వేదికెక్కితే చాలు, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తమ హయాంలోనే సాకారమైందంటూ డప్పు కొట్టుకుంటారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా?
'ఇన్నాళ్లకు ఊరు గుర్తొచ్చిందా?' గ్రామ సమస్యలపై యువత నిలదీత - ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ముఖం చాటేస్తున్న గుత్తేదారులు: గడప గడపకు కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం ప్రచారం కోసం వాడుకుంటున్నా, ఇందులో ప్రతిపాదిత పనులు చేయడానికి గుత్తేదారులు ముఖం చాటేస్తున్నారంటే ఎంత అద్భుతంగా అమలు చేస్తున్నారో తెలుస్తోంది. దాదాపు 65 వేల పనుల్లో ఇప్పటికీ 25 వేల పనులు ప్రారంభమే కాలేదు. వీటికి టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పెండింగ్ బిల్లులిస్తే తప్ప టెండర్లు వేయమంటున్నారు. పనులను విభజించి నామినేషన్ కింద ఇద్దామన్నా అధికార వైసీపీ కార్యకర్తలు కూడా ససేమిరా అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలో 2,500కిపైగా పనులు ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. ఇప్పటికే చేసిన పనులకు 5 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో 600కిపైగా పెండింగ్ పనులకు టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముఖం చాటేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడుసార్లు పిలిచినా స్పందన లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పురపాలక సంఘాల్లో 150 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. కొత్తవలస నియోజకవర్గంలో పూర్తిచేసిన 28 పనులకు 87.88 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో చేసిన పనులకు 2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో 50 లక్షలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కోటి అంచనాలతో మరో 18 పనులు చేపట్టాలి. గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 62 పనుల్లో చాలావరకు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇదే గుంటూరు జిల్లా తెనాలిలోని 22, 24, 28, 35 వార్డుల్లో ప్రతిపాదిత పనుల్లో చాలావరకు ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో 40 పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచినా, గుత్తేదారుల్లో స్పందన లేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులపై ఆసక్తి చూపడం లేదు.
వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు - గడపగడపకు కార్యక్రమం అడ్డుకున్న గ్రామస్థులు, ఉద్రిక్తత
గ్రామ పంచాయతీలపై నిర్లక్ష్యం: గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలన్నా పంచాయతీల తీర్మానం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా ఈ నిబంధన వర్తిస్తుంది. గ్రామ కమిటీకి సర్పంచ్ ఛైర్మన్‌గా ఉంటారు. గ్రామ పంచాయతీలను మొదటి నుంచి పథకం ప్రకారం నిర్లక్ష్యం చేసిన జగన్ ప్రభుత్వం ‘గడప గడపకు’ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వ్యయంలో సర్పంచుల నీడ పడకుండా చేసింది. పనుల గుర్తింపు, నిధుల కేటాయింపునకు ప్రత్యేకంగా కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఇందులో సర్పంచికి స్థానం లేకుండా చేసింది. పంచాయతీకి కాకుండా వీటి పరిధిలోని సచివాలయానికి 20 లక్షల చొప్పున అభివృద్ధి పనుల పేరుతో నిధులు కేటాయించింది. ఇంత చేసీ ప్రభుత్వం ఏం సాధించింది? చేసిన పనులకు బిల్లులు పెండింగులో పెట్టి కార్యక్రమాన్ని నీరు గార్చింది.
ఎమ్మెల్యేల్లో గుబులు: గడప గడపకు కార్యక్రమంలో ప్రజల ఇళ్లకు వెళ్లి గ్రామాల్లో, పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిన అధిక వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం గుబులు రేగుతోంది. ఇందులో ప్రతిపాదించిన పనుల్లో సగం కూడా పూర్తి అవ్వకపోవడంతో, చాలా వరకూ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోనందుకు ఎన్నికల వేళ ప్రజల నుంచి ఎలాంటి ఛీత్కారాలు ఎదురవుతాయోనని ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఒక నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో అధికార ఎమ్మెల్యే ఇదే విషయమై ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేయకుండా ప్రజల్లోకి మళ్లీ ఎలా వెళ్లగలమని అన్నారు.
గడపగడపకు కార్యక్రమంలో ఎంపీ వంగా గీతకు నిరసన సెగ- సమస్యల పరిష్కారంపై నిలదీత