Freehold Land Scam in Anantapur Dist : ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిషేధిత భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వైఎస్సార్సీపీ హయాంలో అసైన్డ్, చుక్కల భూములు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు వారికి అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో 34 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో లక్షా 92 వేల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. కల్యాణదుర్గంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములకు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.
"నన్ను ఎవరూ ఏం చేయలేరు!" 20 ఎకరాలు ఆక్రమించేశాడు - దారిని కూడా దున్నేశాడు
వెలుగులోకి అక్రమాలు : ప్రభుత్వ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఫ్రీ హోల్డ్ భూములపై పరిశీలన చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో పేద రైతులకు 2023 వరకు 2.22 లక్షలు ఎకరాల భూమిని అసైన్డ్ చేసి పంపిణీ చేశారు. దీనిలో 2023 ఏడాదికి 20 ఏళ్లు అంతకంటే ముందు అసైన్డ్ పట్టా పొందిన రైతుల భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తూ రైతులకు క్రయవిక్రయాల హక్కులు కల్పించారు. చుక్కల భూమి విషయంలో 2006కు ముందు 12 ఏళ్లు, అంతకంటే ముందు నుంచి సాగు చేస్తున్న రైతులకు కూడా ఈ తరహా హక్కులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కొందరు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
అనేక చోట్ల ఈ జీవోల పరిధిలోకి రాని భూములను జిల్లాలో అప్పటి కొందరు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ముందుగానే కొనుగోలు చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫ్రీ హోల్డ్ జాబితాలోకి చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ హయాంలో 34 వేల ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేయగా 200 ఎకరాలకు పైగా భూములకు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు దస్త్రాల పరిశీలనలో తేలింది. కల్యాణదుర్గంలో నియోజకవర్గంలోనే 100 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
అక్రమంగా రూ.150 కోట్లకు పైగా సంపాదన - ఎంవీవీ సంస్థల్లో సోదాలపై ఈడీ ప్రకటన
పరిశీలనలో బయటపడుతున్న అక్రమాలు : శ్రీ సత్యసాయి జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూముల విస్తీర్ణం అధికంగా ఉండటంతో ప్రస్తుతం రెండో దశ రికార్డు పరిశీలను జరుగుతోంది. జిల్లాలో 1.92 లక్షల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్ జాబితాలో చేర్చగా వాటిలో 5,242 ఎకరాల భూమి క్రయవిక్రయాలు జరిగినట్లు గుర్తించారు. పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా అసైన్డ్, చుక్కల భూములను ఫ్రీ హోల్డ్ జాబితాలో చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నవంబర్ 10 నాటికి పరిశీలన పూర్తిచేయాలని అక్కడి అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతపురంలో ఈ నెలాఖరుకు పరిశీలన పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు. నిషేధిత భూముల జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ భూముల జాబితాలో చేర్చే అంశంలో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్ కార్యాలయ, జిల్లా రెవెన్యూ అధికారుల వివరాలు సైతం సేకరిస్తున్నారు.
'ఆ భూములు తీసేసుకోండి' భూకేటాయింపుల పిల్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశం