YSRCP Failed to Protect Interests of Muslims in State: గత ఎన్నికల ముందు ముస్లింలకు హామీల గాలం వేసిన జగన్ పెద్దఎత్తున వైఎస్సార్సీపీకి ఓట్లు వేయించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఏ సీఎం చేయనంత దగా చేశారు. ఉపప్రణాళిక అమల్లోకి తీసుకురాకుండా ఉసూరుమనిపించారు. దుల్హన్ పథకం కింద ఇచ్చే పెళ్లికానుకకూ నిబంధనల కొర్రీలు పెట్టారు. నైపుణ్య శిక్షణను నిర్లక్ష్యం చేశారు. షాదీఖానాలూ
కట్టించలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన రంజాన్ తోఫా పథకాన్ని రద్దు చేశారు. హామీలేమీ నెరవేర్చకుండానే ముస్లింలను మరోసారి మోసగించేందుకు యత్నిస్తున్నారు.
Muslim problem in YSRCP government: తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల ముందు మైనారిటీలకు ఉపప్రణాళికను ప్రవేశపెట్టింది. కానీ తానే కొత్తగా మళ్లీ తెస్తున్నట్లు గత మేనిఫెస్టోలో ప్రకటించిన జగన్ అమలు మాత్రం చేయలేదు. 2022 వరకు ఈ విషయాన్నే పట్టించుకోలేదు. 2022-23లో, 2023-24లోనూ బడ్జెట్‌లో ప్రకటించారేగానీ నిధుల్ని మైనారిటీ సంక్షేమశాఖకు ఇవ్వలేదు. ఎన్నికల ఏడాదిని మినహాయించినా కనీసం 40 వేల కోట్లు మైనారిటీలకు దక్కాలి. కానీ చివరకు వివిధ పథకాల ముస్లిం లబ్ధిదారుల సంఖ్యను బయటకు తీసి అవే ఉపప్రణాళిక నిధులని చూపించారు.
చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం పేదలకు రంజాన్ తోఫా పథకాన్ని అమలు చేసింది. రంజాన్ పండుగతో పాటు సంక్రాంతి వేళా.. కానుక పంపిణీ చేశారు. జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపేశారు. వక్ఫ్ భూములకు రక్షణ గోడలు నిర్మిస్తానని హోంగార్డులను కాపలాగా పెడతానని చెప్పిన జగన్... 2019 బడ్జెట్‌లో 20 కోట్లు ఇచ్చినట్లు చూపించి పరిరక్షణ చర్యలు మాత్రం తీసుకోలేదు. ఆ నిధుల్ని మళ్లించేశారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ చర్యలకు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు. వైకాపా నేతలే ఆక్రమిస్తున్నా కబ్జాకు గురైన వక్ఫ్‌భూములు కనిపిస్తున్నా చర్యల్లేవు. ముస్లింలతో భేటీ అయిన ప్రతిసారీ ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని జగన్ నొక్కి మరీ చెప్పారు. ఓట్లు వేశాక మాత్రం ఆ పదాన్నే ఉచ్చరించలేదు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన రాయితీ రుణ పథకాన్నీ ఎత్తేశారు.-నదీమ్‌బాషా, ఎస్సీ మోర్చా సభ్యుడు
ముస్లింలకు జగన్ చేసిందేంటి ? - మైనార్టీల మనోభావాలు ఎలా ఉన్నాయి ? - What CM Jagan did to minorities
'ముస్లింల వివాహాలకు, యువతకు నైపుణ్య శిక్షణకు వీలుగా టీడీపీ ప్రభుత్వం 83 కోట్లు ఖర్చు పెట్టి షాదీఖానాల నిర్మాణం చేపట్టింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎక్కడికక్కడ వదిలేశారు. ఎన్నికల వేళ కొన్ని పనులు పట్టాలెక్కించారు. వసతి గృహాలు, ఐటీఐ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల నిర్మాణాల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు. టీడీపీ ప్రభుత్వంలో 13 దేశాల్లో ఉన్నత చదువుల కోసం 527 మంది ముస్లిం విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తే జగన్ ఏలుబడిలో 70 మందికే చేశారు. షాదీ తోఫా అమలు విషయంలోనూ అంతే. మూడేళ్లపాటు ఆ ఊసే ఎత్తలేదు. ఏడాది క్రితం మళ్లీ కొత్తగా జీవో ఇచ్చి సాయాన్ని పెంచినట్టే చూపించి నిబంధనల కత్తెర వేశారు. పదో తరగతి ఉత్తీర్ణులు కావాలనే నిబంధన తొలగించాలన్న ముస్లిం సంఘాల మొరను చెవికెక్కించుకోలేదు. గతంలో మసీదులు, ఈద్గా, దర్గాల మరమ్మతులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు ఇచ్చేవారు. మైనార్టీల పట్ల కక్షపాతిగా మారిన జగన్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.' -మహ్మద్ ఫారూక్ షిబ్లీ, వ్యవస్థాపకుడు మైనారిటీ పరిరక్షణ సమితి
'ఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి మెజారిటీ ముస్లింలు వైకాపాకే వెన్నుదన్నుగా నిలుస్తున్నా వారిని కనీసం పట్టించుకోలేదు. ముస్లింల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిచ్చింది. 50 శాతం రాయితీతో రుణాలిచ్చింది. మసీదుల్లో ఉండే ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయాన్ని అందించాలని మొదట నిర్ణయించింది టీడీపీ ప్రభుత్వమే. ఇమామ్‌లకు నెలకు 5 వేలు, మౌజమ్‌లకు 3 వేలు చొప్పున అందించారు. ఇమామ్‌లకు 10 వేలు, మౌజమ్‌లకు 5 వేలు చొప్పున పెంచి ఇవ్వడంతోపాటు రాష్ట్రంలోని అన్ని మసీదులకు అమలు చేస్తామని 2017 డిసెంబర్ 11న ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగుబ్బలో పాదయాత్ర వేళ జగన్ ప్రకటించారు. కానీ రాష్ట్రంలో దాదాపు 15 వేల మసీదులుంటే టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 5 వేల మసీదులకే జగన్ పరిమితం చేశారు.'-హుస్సేన్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి మైనారిటీ పరిరక్షణ సమితి
వైఎస్‌ఆర్ జిల్లాలో టీడీపీ ప్రభుత్వం 95 శాతం పూర్తిచేసిన హజ్ భవనాన్ని ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదు. నిధుల కోసం కలెక్టరు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఇవ్వలేదు. ఎన్నికల వేళ పూర్తిచేస్తున్నామంటూ హడావుడి చేసి టెండర్లు పిలిచారు. కానీ ఒక్క గుత్తేదారూ ముందుకు రాలేదు. 2018లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం సమీపంలో హజ్ భననం కోసం 3 ఎకరాల స్థలం కేటాయించి 80 కోట్లు మంజూరు చేశారు. మసీదుతోపాటు, షాదీఖానా నిర్మించాలనుకున్నారు. కానీ జగన్ అధికారంలోకి రాగానే పక్కన పెట్టేశారు.
టీడీపీ, వైఎస్సార్సీపీ సర్కారు హయాల్లో వ్యస్యాసమిలా..
పథకం | టీడీపీ ప్రభుత్వం | వైఎస్సార్సీపీ సర్కార్ |
---|---|---|
షాదీ తోఫా | 40 వేల మందికి | 6,346 మందికి |
వీదేశీ విద్య | 527 మందికి | 70 మందికి కూడా మించలేదు |
రంజాన్ తోఫా | 11.25 లక్షల మంది | 0 |
రాయితీ రుణాలు | రూ.248 కోట్ల ఖర్చు | 0 |
గ్రాంట్ ఇన్ ఎయిడ్ | రూ. 68 కోట్ల ఖర్చు | రూ. 2 కోట్లు |
బీజేపీతో కలిసినా - టీడీపీ ముస్లింలకు మంచే చేస్తుంది: మైనార్టీ నేతలు - Muslim Community Vote Bank