YSRCP Decides Boycott Graduates Constituency MLC Election : కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఆ పార్టీ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా మతలబులే ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఓ వైపు పరువు దక్కించుకోవడంతో పాటు మరోవైపు తమ ప్రత్యర్థి అయిన అధికార టీడీపీను దెబ్బకొట్టవచ్చనే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఆ మూడు స్థానాలను గెలుచుకోవాలని అన్ని ప్రయత్నాలూ చేసింది. ఓటర్ల నమోదులో ఎప్పుడూ వినని, చూడని అక్రమాలకు పాల్పడింది. అయినా మూడు చోట్లా వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవిచూశారు.
ఆ ఘోర పరాభవాన్ని మరచిపోలేదు : ‘పార్టీ అధికారంలో ఉండి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, అరాచకాలు చేసి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గలేకపోయాం. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఆ ఘోర పరాభవాన్ని మరచిపోలేదు. ఈ నాలుగైదు నెలల్లో పరిస్థితులు మనకు సానుకూలంగా మారిన దాఖలాల్లేవు. కాబట్టి ఇప్పుడు పోటీ చేసినా, సాధించేదేమీ ఉండదు. మొన్నటి ఫలితమే పునరావృతమైతే మరింత పతనమవుతాం. పోటీ నుంచి తప్పుకొంటే కనీసం పరువైనా దక్కుతుంది. మరోవైపు అరాచకాలు చేస్తున్నారంటూ టీడీపీపై నిందలూ మోపవచ్చు. పైగా టీడీపీకు మరింత బలంగా పోటీనిచ్చేలా పీడీఎఫ్‌నకు పరోక్షంగా దోహదపడొచ్చు. తద్వారా తెలుగుదేశం పార్టీను దెబ్బకొట్టొచ్చు’ అనే యోచనతోనే వైఎస్సార్సీపీ ఎన్నికలను బహిష్కరించిందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 11న నోటిఫికేషన్ - ఎన్నిక ఎప్పుడంటే!
బరి నుంచి తప్పుకోవడం వెనుక వేరే అంతరార్థం : గతేడాది పట్టభద్రుల ఎన్నికల సమయంలో తాము అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డగోలుగా వ్యవహరించిన విషయాన్ని మరుగున పెట్టి, ఇప్పుడు అధికార టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని, ఈ కారణంగా పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఇది వినడానికి ఎలా ఉన్నా, వైఎస్సార్సీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం వెనుక అంతరార్థం వేరే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారి మధ్య చర్చ జరిగింది.
కార్యకర్తలను ఎందుకు ఇబ్బందుల పాల్జేయాలి? : పోటీ నుంచి తప్పుకోవాలని, అయితే పోటీ చేయలేకపోయారని జనంలో పలుచన కాకుండా ఏం చేయవచ్చో మాట్లాడుకున్నట్లు తెలిసింది. చివరగా ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవు, కాబట్టే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామ’ని చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. సమావేశానంతరం మాజీ మంత్రి పేర్ని నాని అక్కడే మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవు. కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఓటర్లు ప్రశాంతంగా బయటకు వచ్చి ఓట్లు వేసే పరిస్థితి లేదు’ అని వ్యాఖ్యానించారు. సాయంత్రం జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూడా ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే పరిస్థితి ఉంటుందా? ఓటు వేసేందుకు ఓటర్లను తీసుకువచ్చే కార్యకర్తలపై దొంగ కేసులు పెడతారు. ఇలా ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేనపుడు కార్యకర్తలను ఎందుకు ఇబ్బందుల పాల్జేయాలి? అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’ చెప్పారు.
"ఉపాధ్యాయ ఎమ్మెల్సీ"పై ఈసీ స్పష్టత - 5 నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలివే
సామాజిక మాధ్యమాల్లో విషం కక్కుతున్న వైఎస్సార్సీపీ మూకలు - జల్లెడ పడుతున్న అధికారులు