YSRCP Activists Attack on BJP Activists in Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ప్రజల శాంతియుత జీవనానికి భంగం కలిగించేలా, ఓటర్ల ఆలోచనలను మళ్లించేలా ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఒక్క పార్టీ కాదు ఒక్క ప్రాంతానికీ పరిమితం కాలేదు అధికార వైఎస్సార్సీపీ నేతల దాడుల్లో అన్ని పార్టీల వాళ్లూ బాధితులుగా మిగిలిపోయారు.
ప్రచార వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. నాయకులను పరిగెత్తించి కొట్టారు. కార్యకర్తలను చితకబాదారు. మహిళలు అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇళ్లకు నల్లా కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇదీ ఎన్నికల ప్రచార క్షేత్రంలో అధికార పార్టీ నేతల తీరు. ఇంతా జరుగుతున్నా కళ్లెదుటే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా అటు అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. ప్రేక్షక పాత్రలో ఇమిడిపోయారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ప్రచారం చేసుకుంటునన బీజేపీ నేతలపై రాడ్లతో దాడులకు పాల్పడ్డారు.
ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (MLA Kethi Reddy Venkatarami Reddy) వర్గీయులు రెచ్చిపోయారు. స్థానిక శారద నగర్లో బీజేపీ కార్యకర్తలు భాను శ్రీనివాసులు ఉండగా అటువైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. బీజేపీ కార్యకర్తలను గమనించిన వైసీపీ వర్గాలు దూషిస్తూ 30 మంది ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల బరిలో ఉండటంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు హైదరాబాద్ నుంచి బీజేపీ కార్యకర్త భాను శ్రీనివాసులు ధర్మవరం వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు దాడి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం రెండో పట్టణ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
ప్రత్యర్థులపై కేతిరెడ్డి బూతుల దండకం: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై బూతుల దండకం చదివారు. బీజేపీ అభ్యర్థి సత్య కుమార్‌పై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కేతిరెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.