YS Sharmila Chalo Secretariat Protest: దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు 'చలో సెక్రటేరియట్'కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. షర్మిలను ఆంధ్రరత్న భవన్‌లో నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు చలో సెక్రటేరియట్ కార్యక్రమం నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్‌లోనే బస చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రమే విజయవాడకు షర్మిల చేరుకున్నారు. అయితే షర్మిల బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో బస చేయాల్సి ఉండగా, ముందస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసి ఉదయం చలో సెక్రటేరియట్ వెళ్లాలని నిర్ణయించారు. పలుచోట్ల కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టులు, గృహనిర్బంధం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మస్తాన్‌వలి, రుద్రరాజును పోలీసులు అరెస్టు చేశారు.
చలో సచివాలయం నిర్వహించి తీరుతాం: రాత్రి నుంచి పోలీసు దమనకాండ కొనసాగుతోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. అక్రమంగా కేసులు పెడుతున్నారనని, పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల నిరసన చేస్తారన్న గిడుగు రుద్రరాజు, చలో సచివాలయం నిర్వహించి తీరుతామని చెప్పారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బందోబస్తు : మరోవైపు చలో సచివాలయం పిలుపు దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకపోకలు సాగించకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. మందడం, మల్కాపురంలో సచివాలయానికి వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
చలో సెక్రటేరియట్‌ను పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతల గృహనిర్బంధాలపై షర్మిల సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలివస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని నిలదీశారు.
ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే- ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్ షర్మిల
తను ఒక మహిళనై ఉండి హౌస్ అరెస్టు కాకుండా ఉండేందుకు, పోలీసుల నుంచి తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం కాదా అని నిలదీశారు. తాము తీవ్రవాదులమా లేక సంఘ విద్రోహ శక్తులమా అంటూ ప్రశ్నించారు. తమను ఆపాలని చూస్తున్నారంటే భయపడుతున్నట్లే కదా అని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఎక్స్ వేదికగా ఆక్షేపించారు.
ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను నిలువరించినా, బారికేడ్లతో బంధించాలని చూసినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదని షర్మిల స్పష్టం చేశారు. మరోవైపు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ వద్ద భారీగా మోహరించారు. షర్మిలను కూడా పార్టీ ఆఫీసులోనే నిర్బంధించి ఉంచనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు షర్మిల చలో సెక్రటేరియట్‌కు బయలుదేరనున్నట్లు తెలిపారు. తాజాగా ఆమెను నిర్బంధించడంతో ఏ క్షణాన ఏం జరగబోతుందో అని ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
జగన్ ఇచ్చిన హామీలే అమలు చేయలేదు, వైఎస్ఆర్ అశయాలు ఎలా నిలబెడతారు: షర్మిల
Protests for Mega DSC in AP: ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని, మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలకు తోడు విపక్షాలు సైతం మెగా డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చింది.
మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమరనాథ్ ఇంటి ముట్టడి - న్యాయం చేయాలంటూ నినాదాలు