YS JAGAN SHARMILA PROPERTY DISPUTE: జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వాటాల అంశం వై.ఎస్.కుటుంబంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. వరుసగా నాలుగు రోజుల పాటు షర్మిల మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా నిన్న తల్లి విజయమ్మ కూడా షర్మిలకు వత్తాసు పలుకుతూ జగన్ చేసింది అన్యాయం అనే విధంగా ప్రకటన విడుదల చేయడం జగన్‌కు మింగుడు పడలేదు. షర్మిల, విజయమ్మ ప్రకటనలు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయనే ఆందోళన ఆయనలో ఉన్నట్లు సమాచారం. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆస్తుల గండం నుంచి ఏవిధంగా బయట పడాలనే దానిపై కుటుంబ సభ్యులతో మంతనాలు చేసినట్లు తెలిసింది.
కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి కలిసిన జగన్: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల నుంచి ఎప్పుడు ఇడుపులపాయ, పులివెందుల వచ్చినా కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లింది చాలా అరుదు. ఉంటే ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లేదంటే పులివెందుల క్యాంపు కార్యాలయం. తనను కలవాలంటే ఎవరైనా ఆ రెండు ప్రాంతాలకు రావాల్సిందే. అలాంటిది రెండు రోజుల నుంచి పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి పలువురు కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి కలుస్తుండటం చర్చనీయాంశమైంది. తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సంపాధించిన కుటుంబ ఆస్తుల్లో తనకు వాటా రావాలని జగన్ సోదరి షర్మిల డిమాండు చేస్తున్న తరుణంలో, ఆమెకు మద్దతుగా విజయమ్మ కూడా నిలవడం జగన్ జీర్ణించుకోలేని పరిస్థితి.
'జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి' - వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగలేఖ
వివాదం నుంచి బయటపడేందుకు: తల్లి కూడా తాను చేసింది తప్పనే విధంగా బహిరంగ ప్రకటన విడుదల చేయడంతో ఈ వివాదం ఎటువైపు దారితీసి కుటుంబానికి, పార్టీకి నష్టం చేకూరుస్తుందోననే ఆందోళన జగన్‌లో మొదలైనట్లు సన్నిహిత వర్గాల సమాచారం. రెండోరోజు పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉదయమే ఎంపీ అవినాష్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో చాలా సేపు చర్చలు జరిపినట్లు సమాచారం. విజయమ్మ లేఖపై దుమారం రేగుతున్న తరుణంలో ఏవిధంగా రాజీ కుదుర్చుకోవాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది.
అంతటితో ఆగని జగన్, అవినాష్ రెడ్డి పెదనాన్న వై.ఎస్.ప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో దాదాపు అరగంట పాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలిసింది. ఆస్తుల విషయంలో విజయమ్మతో రాయబారం నెరిపే అంశంపై ప్రకాశ్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. ఈయన ఇంటికే కాకుండా మరో ఇద్దరు సన్నిహితుల ఇళ్లకు వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన జగన్ మోహన్ రెడ్డి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వారిందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఫొటోలు, సెల్పీలు తీసుకోవడంలో జగన్ బిజీగా కనిపించారు.
కుటుంబ ఆస్తుల గొడవ ఓ వైపు నడుస్తుండగా, ఆ అంశం సొంత నియోజకవర్గ ప్రజల్లో కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో వారందరితో సఖ్యతతో మెలిగారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పని చేయాలని, అండగా ఉంటానని చెప్పినట్లు సమాచారం. ప్రజాదర్బార్‌కు ముందు తర్వాత జగన్ ముఖ్యులతో ఆస్తుల వాటాల అంశంపై చర్చించినట్లు తెలిసింది. కుటుంబ పరువు వీధిన పడుతున్న పరిస్థితుల్లో ఏవిధంగా బయట పడాలనే దానిపై జగన్ మదన పడుతున్నట్లు తెలిసింది.
జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్: వైఎస్ షర్మిల