Khammam City 04 Organizations for Social Services : సోషల్ మీడియాలో కాలం వెళ్లదీస్తే ఏం వస్తుంది? సమాజానికి ఉపయోగపడే ఏదైనా పని చేద్దాం అనుకున్నారు ఈ యువత. ఆలోచనను ఆచరణలోకి తెస్తూ ఇస్టాగ్రామ్‌లో ఖమ్మం సిటీ 04 ఆర్గనైజేషన్ ప్రారంభించారు. వీరి ఆలోచిన నచ్చి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సాయం అందించారు. ఫలితంగా ఎంతో మంది నిరుపేదలకు, విద్యార్థులకు సేవలు అందించారు ఈ ఔత్సాహితులు.
ఖమ్మం నగరానికి చెందిన ఈ యువకుడి పేరు ప్రేమ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాడు. నగరానికి సంబంధించిన సమగ్ర సమాచారం, ప్రత్యేక కార్యక్రమాలు, రోజువారీ ముఖ్య విశేషాలు ప్రజలకు తెలియజేసేందుకు ఓ ప్లాట్‌ఫామ్ ఉండాలని భావించాడు. స్నేహితులు, తెలిసినవారితో ఇదే విషయాన్ని పంచుకున్నాడు. ఐడియా నచ్చడంతో ఖమ్మం సిటీ 04 ఆర్గనైజేషన్ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీని ప్రారంభించారు.
విద్యార్థులు - ఒంటరి మహిళలకు అండగా : సోషల్ మీడియాను వినూత్నంగా ఉపయోగించుకోవాలనే సదుద్దేశంతో 8 మందితో ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీని మెుదలు పెట్టారు. అయితే ఐడియా నచ్చడంతో అనతికాలంలోనే వేలల్లో ఫాలోవర్లు చేరారు. మేము సైతం అంటూ సందేశం ఇచ్చారు. ఇందులో విద్యార్థులు, ఉద్యోగులు, స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారస్థులు, ప్రముఖులు చేరారు. దాంతో వీళ్లు ఊహించిన దానికంటే ఎక్కువగా సంఖ్యలో ఖమ్మం ప్రజలకు రీచ్ అయ్యింది సిటీ 04 ఆర్గనైజేషన్ పేజీ.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు, అన్నార్థులు, అనాథలు, ఒంటరి మహిళలకు అండగా ఉంటోంది ఈ ఆర్గనైజేషన్. కొవిడ్ సమయంలో బాధితులకు సరైన వైద్యం, చికిత్సల కోసం ప్రత్యేకంగా సమాచారం అందజేసేందుకు వీరు కృషిచేశారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో చదువుకునే వందలాది మంది నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు, పరీక్ష కిట్లు అందజేశారు.
నిరుపేద కుటుంబాల్లో పుట్టిన చిన్నారులు, చదువుకు దూరంగా ఉన్న వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. చదువు విలువను తెలియజేసేలా తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లల్ని విద్యాలయాల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆటల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఒంటరి మహిళలు తమ కాళ్లమీద తాము నిలబడేలా శిక్షణ అందించి వారికి ఉపాధి మార్గాలు చూపుతున్నారు.
డ్రగ్ ఫ్రీ ఖమ్మం పేరిట కార్యక్రమం : ప్రస్తుతం వీళ్ల ఇన్‌స్టాగ్రామ్ పేజీని దాదాపు 85000 మంది అనుకరిస్తున్నారు. ఎవరికి సమయం దొరికితే వాళ్లు ఇలా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వీరు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ ఖమ్మం పేరిట కార్యక్రమం మొదలుపెట్టి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సమయాత్తమవుతున్నారు.
ఖాళీ సమయం దొరికిందంటే విలాసాలు, విహార యాత్రలకు యువత వెళ్తున్నరోజులు ఇవి. ఇలాంటి బిజీ సమయంలోనూ సామాజిక సేవకు కేటాయిస్తున్న ఖమ్మం సిటీ 04 ఆర్గనైజేషన్‌ను అందరు ప్రశంసిస్తున్నారు. పెడదారి పడుతున్న యువతను గాడిన పెట్టేలా సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ వినూత్నంగా ముందుకు వెళ్తోంది ఈ ఆర్గనైజేషన్.
'ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఖమ్మం సిటీ 04 ఆర్గనైజేషన్ పేరిట ఇన్‌స్టాగ్రామ్ ప్రారంభించారు. సాయం చేయాలని ఉద్దేశంతో ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించాం. దీని వల్ల ఖమ్మంలో ఎనిమిది మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం'-బోగ హరిప్రియ, నిర్వాహకురాలు
YUVA : సంకల్పం ముందు - వైకల్యం ఓడింది - ఈయన ఓ తరానికి ఇన్స్పిరేషన్ - Disabled Man Inspiring Story