Youth Attacked the Bus Conductor in Bapatla District: బస్సు ఫుట్ బోర్డు వద్ద నిలబడి మహిళను ప్రయాణం చేయవద్దన్నందుకు ఆగ్రహించిన ఆమె స్వగ్రామానికి చెందిన యువకులు బస్సు అద్దాలు పగలగొట్టి కండక్టర్పై దాడి చేసిన ఘటన బాపట్ల జిల్లా చందోలులో చోటుచేసుకుంది. కుంచాల వారిపాలేనికి చెందిన దోమ నాగలక్ష్మి రేపల్లె నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కి గేటు వద్ద నిల్చున్నారు. కండక్టర్ ఎన్ని సార్లు చెప్పినా ఆమె బస్సు లోపలికి రాకుండా గేటు వద్దే నిల్చున్నారు.
బస్సులోకి ఎక్కే ప్రయాణికులకు అలాగే దిగుతున్న వారికి ఇబ్బందిగా ఉందని కండక్టర్ బస్సు లోపలికి రావాలని, లేకపోతే బస్సు నుంచి దిగిపో అని చెప్పటంతో చెరుకుపల్లిలో ఖాదర్ ఖాన్ సెంటర్ వద్ద మహిళ బస్సు దిగింది. అనంతరం ఆమె గ్రామంలోకి వెళ్లి యువకులను తీసుకుని చందోలు పెట్రోలు బంకు కూడలి వద్ద బస్సు కోసం కాపు కాశారు. గుంటూరు వెళ్లిన బస్సు తిరిగి చందోలు రాగానే ఆమెతో వచ్చిన యువకులు బస్సుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. బస్సు కండక్టర్ బెల్లంకొండ వెంకట రమణయ్యపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. అడ్డు వచ్చిన బస్సు డ్రైవర్ వాసుదేవరావు, ప్రయాణికులనూ పక్కకు నెట్టేశారు.
విషయం తెలుసుకున్న చందోలు పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ముగ్గురు యువకులను పట్టుకోగా 9 మంది పరారయ్యారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు దాడి చేసిన 12 మందితో పాటు దోమ నాగలక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చందోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న కండక్టర్ రమణయ్యను ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్సులో మందుబాబు వీరంగం- ప్రయాణికులు ఏంచేశారంటే! - drunken man attacked conductor