Young Man Died at Bogatha Waterfalls : రాష్ట్రంలో గత నాలుగురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతూ, ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవి ప్రాంతంలోనూ కురిసిన భారీ వర్షాలకు పెనుగోలు అడవి ప్రాంతం నుంచి కొండ కోనల్లో వాగులు వంకలు పొంగిపొర్లడంతో ములగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి వద్ద బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు సైతం పెద్దఎత్తున వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బొగత జలపాతం అందాలు చూడటానికి స్నేహితులతో వచ్చిన ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు.
వరంగల్‌లో ఎనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్‌కు చెందిన బొనగాని జస్వంత్(18) ఏడుగురు స్నేహితులతో కలిసి బొగత జలపాతాన్ని వీక్షించేందుకు వచ్చారు. అదే క్రమంలో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ ఫూల్లో స్నానాలు చేస్తుండగా జస్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. ఇది గమనించిన సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. జలపాతం వద్ద వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులను స్విమ్మింగ్ ఫూల్లో ఈతకు అనుమతించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
స్నేహితులతో సరదాగా గడపాలని : విహారయాత్రలో స్నేహితులతో సరదాగా గడపాలని వచ్చిన వారిలో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడంతో తోటి మిత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. స్నేహితులైన ధర్మ తేజ, సాయి కిరణ్, సుశాంత్, నాగేంద్ర, వంశీ, గౌస్‌ల నుంచి వివరాలు సేకరించారు.
ఈ నెల 22న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో కలిసి బొగత జలపాతాన్ని వీక్షించారు. జలపాతం వద్ద ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆమె సూచించారు. పర్యాటకులకు మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి సీతక్క బొగత జలపాతాన్ని సందర్శించిన మరుసటి రోజే యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందడం గమనార్హం.