Digital Arrest Frauds Threats in AP : సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవైపు బహుమతులు, ఉద్యోగాలు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు. డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో బెదిరింపులకు గురిచేస్తూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంథాలో దోచుకుంటున్నారు. పొరపాటున చిక్కారా ఖాతాలు ఖాళీ చేసి మాయమవుతారు.
తాజాగా 'బ్యాంకాక్‌కు పంపిన కొరియర్‌లో 170 గ్రాముల డ్రగ్స్ ఉన్నాయి మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ' ఓ యువకుడికి సైబర్ నేరస్థులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. కేసు విషయమై మాట్లాడేందుకు దిల్లీ రావాలని భయాందోళనకు గురిచేశారు. కానీ అతను మాత్రం తాను విజయవాడ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ నుంచి మాట్లాడతానని చెప్పడంతో వారు తోక ముడిచి కాల్ కట్ చేశారు. అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Cyber Fraud Cases in AP : యనమలకుదురుకు చెందిన హరీశ్ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తుంటారు. బుధవారం ఉదయం ఆయన మొబైల్‌కి డీఎస్‌ఎల్ పార్శిల్ సర్వీస్ పేరుతో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ డిసెంబర్ 4న బ్యాంకాక్‌కు కింగ్‌పిన్ అనే వ్యక్తి పేరుతో పార్శిల్ బుక్ చేశారని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.16,130లు కొరియర్ ఛార్జీలు చెల్లించారని వారు చెప్పారు. తాను అలాంటి కొరియర్ ఏమీ చేయలేదని హరీశ్ చెప్పినా కేటుగాడు వినలేదు. మీరు పంపిన పార్శిల్‌లో 2 పాస్‌బుక్‌లు, 3 పాస్‌పోర్ట్‌లు, 170 గ్రాముల డ్రగ్స్ (ఎండీఎంఎ), ఒక ల్యాప్‌టాప్ వంటివి ఉన్నాయని ఆ వ్యక్తి చెప్పాడు.
ఇది నేరం కిందకు వస్తుందని హరీశ్‌ని ఆ వ్యక్తి భయపెట్టాడు. వెంటనే దిల్లీ క్రైం బ్రాంచ్‌కు కాల్ కలిపారు. లైనులోకి వచ్చిన క్రైం బ్రాంచ్ అధికారి స్కైప్ డౌన్‌లోడ్ చేసుకుని వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. తాను విజయవాడ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మాట్లాడతానని హరీశ్ చెప్పినా వినలేదు. కాల్ కట్ చేయవద్దంటూ అవతలి వ్యక్తి బెదిరిస్తూ ఇది విజయవాడకు సంబంధం లేదని, దిల్లీ రావాల్సిందేనని హెచ్చరించాడు.
Threats From Digital Arrest in Vijayawada : ఈ క్రమంలో హరీశ్ ఏ మాత్రం భయపడకుండా తాను సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచే మాట్లాడతానని పట్టుబట్టడంతో వారు కాల్‌కట్ చేశారు. భయపడకుండా పోలీస్‌స్టేషన్‌కి వచ్చి సమాచారం అందించిన హరీశ్‌ను సైబర్ క్రైం సీఐ గుణరామ్, ఇతర సిబ్బంది అభినందించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరు ఫోన్ చేసినా భయపడద్దని మరోసారి వారు సూచించారు.
'మేం పోలీసులకు భయపడం - డబ్బులు ఇవ్వం, అరెస్ట్ చేస్తారా చేయండి'