YCP Leaders Irregularities in Jagananna Colonies: జగనన్న కాలనీల్లో పేదలు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడాన్ని ఆసరా చేసుకుంటున్న వైసీపీ నేతలు దళారులు, వాటిని తక్కువ ధరకు దక్కించుకుంటున్నారు. అనంతరం వేరొకరికి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 లే-అవుట్లలో 5 వేల మందికి పైగా లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్ని ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. జగనన్న కాలనీల్లో మంజూరైన స్థలాలు, ఇళ్లను పదేళ్ల వరకు విక్రయించకూడదన్నది నిబంధన. కానీ అధికార పార్టీ నాయకులు దళారులు, స్థిరాస్తి అనధికారికంగా కొనుగోలు చేస్తున్నారు. కొన్నిచోట్ల 100 రూపాయల విలువైన స్టాంప్ పత్రాలపై రాయించుకుంటున్నారు. గృహ నిర్మాణ సంస్థ దస్త్రాల్లో మాత్రం లబ్ధిదారుడి పేరే ఉంటుంది. అమ్ముకునే హక్కు లబ్ధిదారులకు సంక్రమించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందంలో పేర్కొంటున్నారు.
పేదలు ఇల్లు, స్థలాల్ని లబ్ధిదారుల్ని అయినకాడికి అమ్ముకునే అనివార్య పరిస్థితుల్లోకి ప్రభుత్వమే నెడుతోంది. పట్టణ ప్రాంతాల్లోని జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 30 వేల రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కేంద్రం ఆర్థికసాయం కింద లక్షన్నర ఉపాధి హామీ పథకం మరో 30 వేల రూపాయలు అందిస్తోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రం ఇచ్చేది గుండుసున్నా. కానీ సెంటుగానీ, సెంటున్నరలోగానీ ఇల్లు కట్టుకోవడానికి కనీసం 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది.
సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు - కనీస వసతుల్లేకుండా ఎలా ఉండాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం
నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో గరిష్ఠంగా ఇస్తున్న లక్షా 80 వేలు ఏ మూలకూ చాలడంలేదని లబ్ధిదారులు మొత్తుకుంటూనే ఉన్నారు. ఆర్థిక సాయం పెంచని ప్రభుత్వం ఎలాగోలా ఇల్లు కట్టాల్సిందేనంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తోంది. ఇవి తట్టుకోలేక స్థలాలు అమ్ముకుంటున్నారు. పేదల పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న వైసీపీ నేతలు జగనన్న కాలనీల్లో గద్దల్లా వాలిపోతున్నారు. కారుచౌకగా స్థలాలు కొట్టేస్తున్నారు.
Vizianagaram District: విజయనగరం జిల్లా గుంకలాంలోని జగనన్న కాలనీలో అందరికీ ఇళ్ల పథకాన్ని సీఎం జగన్ ఇక్కడి నుంచే ప్రారంభించారు. విజయనగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఈ లేఔట్‌లో 10వేల 360 ప్లాట్లు ఇచ్చారు. ఇక్కడ ఇల్లు కట్టించేది ప్రభుత్వమే. కానీ ఇందులో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎక్కువశాతం పూర్తికాని నిర్మాణాలుండగా వాటి మధ్య కొన్ని రెండతస్థుల ఇళ్లున్నాయి. దీనికి కారణం ప్లాట్లు చేతులుమారడమే. జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్ని దళారులు, వైసీపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారు. గుంకలాం లేఔట్‌లోనే సుమారు 3 వేల మంది లబ్ధిదారులు స్థలాలు విక్రయించారని అంచనా. ఇక్కడ సెంటు 4 నుంచి 5 లక్షల రూపాయలు పలుకుతుంటే అంతకు తక్కువకే బేరాలు చేస్తున్నారు.
డబ్బులివ్వాలని జగనన్న లేఔట్ గుత్తేదారునికి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు సంబంధించిన లుంగురు లేఔట్‌లో 20 నుంచి 30వరకు ఇంటి స్థలాలు చేతులు మారినట్లు తెలుస్తోంది. సాలూరుకు సంబంధించి నెలపర్తి వద్ద వేసిన లేఔట్ పక్కనే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఉండటంతో స్థలాలకు గిరాకీ పెరిగింది. సెంటు 3 నుంచి 5లక్షల వరకూ వైసీపీ నేతల కనుసన్నల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి.
Anakapalli District: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం కాలనీలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేల రూపాయలతో ఇల్లు నిర్మించలేక కొందరు అమ్మేసుకుంటున్నారు.
Srikakulam District: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శ్యామసుందరాపురం జగనన్న లేఅవుట్లో మూడంతస్తుల ఇళ్ల నిర్మాణాలూ జరిగాయి. 117 మంది స్థానికేతరులు అక్కడ ఉంటున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ అధికారులు కేవలం 12 మంది మాత్రమే అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఇక్కడ పట్టాలు ఒకరు తీసుకుంటే ఇల్లు వేరొకరు కట్టున్నారు. ఇక్కడ బహిరంగ మార్కెట్ ధర 8 నుంచి 10లక్షలు నడుస్తుంటే అందులో సగం రేటుకే వైసీపీ నాయకులు కొంటున్నారనే ప్రచారం ఉంది.
సమస్యలకు నిలయంగా జగనన్న కాలనీలు-మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారుల విజ్ఞప్తి
Krishna District: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు కాలనీలో కొందరు పక్కపక్కనే ఉన్న రెండు మూడు ప్లాట్లు కొనేసుకున్నారు. సెంటున్నర 4 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేశారని తెలుస్తోంది. కొందరు అధికారులు, వైసీపీ నాయకులు కూడా లబ్ధిదారుల పేరిట స్థలాలు తీసుకుని నిర్మాణాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
Guntur District: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డిపాలెం లేఔట్‌లో సుమారు పది మంది లబ్ధిదారులు స్థలాలు అమ్ముకున్నారు. ఒక్కో ప్లాటు 70వేల నుంచి లక్ష వరకూ వెచ్చించి కొన్నారు. రిజిస్ట్రేషన్లు లేనందున ప్రైవేటు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుతం మంజూరు చేసే బిల్లులు మొత్తం కొనుగోలుదారులకే ఇచ్చేలా ముందే రాయించుకుంటున్నారు.
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద 6200 మందికి ఒకటిన్నర సెంటు చొప్పున పట్టాలిచ్చారు. ఈ కాలనీలో వైసీపీ నాయకులు, దళారులు తిష్టవేశారు. సెంటు 4 లక్షల వరకూ రేటుకడుతున్నారు. ఈ కాలనీలో 50 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగాయని స్థానిక స్థిరాస్తి వ్యాపారులు చెప్తున్నారు. పలువురు వైసీపీ నాయకులు బహుళ అంతస్తులూ నిర్మించుకుంటున్నారు. హిందూపురం మండలం పూలకుంటలో వైసీపీ నాయకుడు రెండంతస్తుల భవనం నిర్మించుకుంటూ నన్నడిగేదెవరు అన్నట్లు జగన్ ఫ్లెక్సీ పెట్టుకున్నారు.