YCP Leaders and activists Joins TDP: జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు నచ్చి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి, సైకిల్ ఎక్కుతున్నట్లు చెబుతున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతుండటంతో వైసీపీ నేతలు ఖంగుతింటున్నారు. వరస చేరికలతో తెలుగుదేశం పార్టీ కళకళలాడుతోంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు.
బాపట్ల జిల్లాలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పర్చూరు మండలం నాగులపాలెం మాజీ జేడ్పీటీసీ సభ్యుడు కొల్లా సుభాష్ బాబు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన నందిగామ నుంచీ టీడీపీ లోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ధనేకుల సాంబశివరావుతో పాటు కొంత మంది నాయకులు, 40 కుటుంబాలు వైసీపీని వీడాయి.
కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశంలోకి వైసీపీకి చెందిన 100 మంది చేరారు. బిల్లపాడు గ్రామానికి చెందిన కార్యకర్తలు... గుడివాడ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాము వారి సమస్యలు తెలుసుకొని.. కూటమి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొడాలి నానిని ఓడించి తీరుతామని బిల్లపాడు ప్రజలు తేల్చిచెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి గెలుపుకోసం సాయశక్తులా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన 100కు పైగా కుటుంబాలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కాయి. టీడీపీ అభ్యర్థి శ్రావణి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీని నమ్మినందరూ నష్టపోయారన్నారు. తెలుగుదేశంలో గౌరవం దక్కుతుందని తెలిపారు. వైసీపీ పాలనపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిపారు.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. కర్నూలు 38వ వార్డు వైసీపీ కార్పొరేటర్ గిబ్బన్ కోడుమూరు నియోజకవర్గ ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో 38వ డివిజన్‌కు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు తెలుగుదేశంలో చేరారు. వారితో పాటు మరో వంద మంది సైకిల్ ఎక్కారు. దామచర్ల జనార్దన్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.