YCP Leader Pinnelli Ramakrishna Reddy Bail Petition In High Court : బెయిలు షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వివిధ కేసులలో నిందితుడిగా ఉండి విదేశాలకు పారిపోయిన తన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కలిసేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిలు షరతులను సడలించాలని కోరుతున్నారని పోలీసుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ రద్దు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. నోటీసులు అందజేయడానికి వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేరన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేర చరిత్ర ఉందన్నారు. బెయిలు షరతును సడలించవద్దని కోరారు.
నవంబర్ 4న తగిన ఉత్తర్వులు : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ, కుమారుడి చదువు నిమిత్తం పిటిషనర్ సింగపూర్ వెళ్లాల్సి ఉందన్నారు. మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించిన పాస్‌పోర్టును తిరిగి ఇప్పించాలని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారంలో ఓసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు అవుతున్నారన్నారు. విదేశాలకు వెళ్లాల్సిన నేపథ్యంలో హాజరు షరతును సడలించాలని కోరారు. పిటిషనర్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలా? లేదా? అనేది విచారణ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 4న ఈ పిటిషన్లపై తగిన ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు.
పలు షరతులతో కూడిన బెయిలు : పోలింగ్ రోజు(మే 13న) పాల్వాయిగేటు కేంద్రంలోకి తన అనుచరులతో చొరబడిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసి, అడ్డుకునే యత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. మర్నాడు కారంపూడిలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అలాగే సీఐ నారాయణస్వామిని గాయపరిచారు. ఈ ఘటనలపై రెంటచింతల, కారంపూడి పోలీసులు రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులలో హైకోర్టు పిన్నెల్లికి గతంలో షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్పగించాలని, ప్రతివారం పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలని పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించింది.