Toor Dal distribution in Prakasham: ఓ వైపు ధరలు పెరిగి, ఆదాయాలు పడిపోయి అల్లాడుతున్న జనం నోటికి పప్పన్నం కూడా దొరక్కుండా చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో చౌక దుకాణాల నుంచి వారికి అందించాల్సిన కందిపప్పును ఆపేశారు. ప్రతి నెలా రూ. 9 కోట్ల చొప్పున గత ఏడాదిన్నరగా రూ. 162 కోట్ల మేర జనం డబ్బును నిర్దాక్షిణ్యంగా లాగేసుకున్నారు. పేదల నోటి వద్ద ముద్దను కొట్టేసి, ఆ మొత్తంలో అరకొర పంచుతూ, తమది సంక్షేమ ప్రభుత్వమంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో చౌక దుకాణాలలో పంపిణీపై ప్రత్యేక కథనం.
ప్రకాశం జిల్లాలో 1,392 రేషన్ దుకాణాల పరిధిలో 6.60 లక్షల బియ్యం కార్డులున్నాయి. వీటి ద్వారా ఆయా కుటుంబాలకు బియ్యంతో పాటు, అర కిలో పంచదార, కిలో కందిపప్పు రాయితీపై ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. 2019 వరకు రాయితీపై కిలో రూ.40 చొప్పున ప్రతి నెలా కార్డుకు రెండు కిలోలు ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీ తగ్గించి ఆ ధరను రూ.67కు పెంచింది. అది కూడా రెండు కిలోలకు బదులు కిలోకు తగ్గించింది.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో రూ.180 వరకు పలుకుతోంది. పౌర సరఫరాల దుకాణాల ద్వారా రాయితీ పోనూ కిలో రూ.67కే కందిపప్పు ఇవ్వాల్సి ఉంది. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే ధరతో పోలిస్తే బయట కిలోకు రూ.113 అధికం. జగన్ ప్రభుత్వం ఇక్కడే కుతంత్రానికి తెర లేపింది. సంక్షేమాన్ని మరిచి.. రాయితీని భారంగా భావించింది. బయట మార్కెట్లో ధర పెరగడంతో రాయితీ భరించలేక సరఫరాపై చేతులెత్తేసింది. ఏడాదిన్నరగా జిల్లాకు అరకొరగా ఇస్తూ వస్తోంది. దీంతో 80 శాతం మంది కార్డుదారులు బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కల్పించింది.
‘2014కు ముందు రేషన్ దుకాణానికి వెళ్తే బియ్యంతో పాటు, కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామోలిన్, గోధుమ పిండి, కారం, పసుపు, ఉప్పు తదితర తొమ్మిది రకాల వస్తువులు లభించేవి. 2014 తర్వాత చంద్రబాబు పాలనలో రేషన్ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప ఏమైనా దొరుకుతుందా..? రెండు చేతులు పైకెత్తి చెప్పండి’ అంటూ ప్రజా సంకల్ప యాత్రల్లో జగన్ మోహన్ రెడ్డి అబద్ధాన్ని నిజమని నమ్మించేలా పదే పదే మాట్లాడారు.
2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తొమ్మిది రకాల సరకులు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో కార్డుకు రెండు కిలోల కందిపప్పు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్ ఆ పరిమాణాన్ని కిలోకు కుదించారు. గత ఏడాదిన్నరగా 20 నుంచి 30 శాతం కార్డుదారులకే కందిపప్పు ఇస్తున్నారు. ఏడాది క్రితం కందిపప్పు, పంచదార అరకొరగా సరఫరా చేశారు. వరుస పండగల సమయాల్లోనూ కందిపప్పు పంపిణీ నిలిపేశారు. దీంతో పేద కుటుంబాలు పప్పన్నం తినలేని పరిస్థితి కల్పించారు.
దీపావళి వేళ కందిపప్పు కోసం పేదల ఎదురు చూపులు
జిల్లాలో 6.60 లక్షల కార్డులు ఉండగా, అందుకు ప్రతి నెలా 660 టన్నుల కందిపప్పు అవసరం. ఏడాదిన్నరగా 100 నుంచి 160 టన్నుల మేర మాత్రమే జిల్లాకు సరఫరా అవుతోంది. మరో 500 టన్నుల మేర నిల్వ రావడం లేదు. దీంతో ప్రతి నెలా 5 లక్షల కార్డుదారులు రాయితీ కందిపప్పునకు దూరం అవుతున్నారు. కిలో రూ.180 చొప్పున టన్ను రూ.1.80 లక్షలుంటుంది. ఈ చొప్పున 500 టన్నుల పప్పు ధర రూ.9 కోట్ల మేర పలుకుతుంది. ప్రకాశం జిల్లాకు 5 లక్షల కుటుంబాలకు కందిపప్పు ఆపేయడం ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా రూ.9 కోట్ల మేర ఖర్చు సంక్షేమాన్ని నిలిపేసింది. గత 18 నెలలుగా చూస్తే ఈ మొత్తం రూ.162 కోట్లు కావడం గమనార్హం.
కిలో కందిపప్పు కూడా ఇవ్వలేకుంటే రానున్న ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలంటూ ఎండీయూ ఆపరేటర్లతో పాటు, వాహనంలోనే ఉంటున్న డీలర్లను కార్డుదారులు నిలదీస్తున్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీలో భాగంగా కందిపప్పు ఎందుకు ఇవ్వరంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో రంజాన్, క్రిస్మస్, సంక్రాంతికి ప్రత్యేకంగా కానుకల పేర్లతో సరకుల కిట్లను ఉచితంగా ఇచ్చేవారని.. వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడమే కాదు, రాయితీపై కందిపప్పును కూడా అందించలేని దుస్థితిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైపైకి ఎగబాకుతున్న నిత్యావసరాలు - ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు విలవిల