Women Agitation for Road in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో ప్రధాన రహదారిని బాగు చేయాలని కోరుతూ స్థానికులు రోడ్డెక్కారు. రోడ్డుపై భారీ గుంతలు పడటంతో వాహనాలు వెళ్లినప్పుడు దుమ్ము, దూళితో తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ దుమ్ము వల్ల వృద్ధులకు ఉపిరితిత్తుల సమస్యలు, చిన్న పిల్లలు చర్మ వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయిదేళ్లుగా సమస్యను పరిష్కరించడం లేదు: అయ్యా ఎమ్మెల్యే గారు, తమను వాహనాల నుంచి వచ్చే దుమ్ము, ధూళి నుంచి కాపాడాలంటూ గుడివాడ పట్టణ 11, 12వ వార్డు సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానికి మొర పెట్టుకుంటున్నారు. తమకు మంచి చేస్తారనే మీకు ఓట్లు వేసి గెలిపించామని, కానీ మీరు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు అవుతున్నా తమ సమస్యలకు పరిష్కారం చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు
ముదినేపల్లి రోడ్డులో పెట్రోల్ బంక్, చేపల మార్కెట్ సమీపంలో భారీ గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. భీమవరం, ముదినేపల్లి వెళ్లేందుకు గుడివాడ మీదుగా నిత్యం వందలాది లారీలు, ఆర్టీసీ బస్సులు, కార్లు ఈ మార్గంలో వెళ్తుంటాయని తెలిపారు. దీంతో బైపాస్ రోడ్డు మలుపు వద్ద భారీ గుంతలు పడ్డాయన్నారు.
రహదారి గుంతల్లో నిండు ప్రాణాలు - ఈ పాపం జగన్ ప్రభుత్వానిదే!
ఇళ్లలోకి వస్తున్న దుమ్ము, ధూళి: వాహనాలు వెళ్లుతున్న సమయంలో తెల్లటి పొగ రుపంలో రోడ్డుపై ఉన్న దుమ్ము, ధూళి తమ ఇళ్లలోకి వచ్చేస్తుందని మహిళలు తెలుపుతున్నారు. గతంలో సైతం ఇలాగే ఉంటే మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. అప్పుడు కేవలం గుంతలు మాత్రమే పూడ్చారని స్థానికులు తెలిపారు.
రోడ్డుకు మరమ్మతులు చేయాలని తాము అప్పుడే అడిగినా అధికారులు పట్టించుకోకుండా గుంతలను మాత్రమే పూడ్చారని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం భారీ వాహనాలు తిరుగుతుండటంతో రాళ్లు పైకి తేలి, వాహనాల వేగానికి చెల్లాచెదురుగా పడిపోయాయని చెబుతున్నారు. దుమ్ము, ధూళి తమ ఇళ్లలోకి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇళ్లల్లో ఉంటున్నామో లేక రోడ్డుపై ఉంటున్నామో తెలియడం లేదని ధ్వజమెత్తారు.
నాడు అభివృద్ధి చేస్తామని చెప్పి, నేడు పట్టించుకోవడం లేదు: ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతిపక్షంలో ఉన్నప్పడు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సమస్యపై అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా లాభం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కొడాలి నాని, మున్సిపల్ అధికారులు స్పందించి ధ్వంసమైన రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రెండేళ్లైనా పూర్తికాని రోడ్డు - ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మూడేళ్లుగా నరకం చూస్తున్న ప్రజలు - రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణమంటేనే హడల్