Women Achieved Junior Civil Judge job in Alluri District : అనుకున్న ఉద్యోగం సాధించాలంటే కాస్త కష్టమే. కానీ కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు. పైగా తండ్రికి నిత్యం బదిలీలు కావడంతో విద్యాభ్యాసంలో ఒడుదుడుకులు ఎదురయ్యాయి. అయినా కష్టపడి చదివింది. మెుదటిసారి విఫలమైనా, రెండోసారి పట్టుబట్టి విజయం సాధించింది. న్యాయమూర్తి కావాలనే ఆమె సంకల్పాన్ని నెరవేర్చుకుంది. జూనియర్ సివిల్ జడ్జ్‌గా ఎంపికైన ఆ యువతి కథేంటో మీరు తెలుసుకోండి.
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలను కళ్లారా చూసిందా యువతి. వాటిని రూపుమాపడానికి న్యాయవాద వృత్తే సరైందని భావించింది. మొదటిసారి విఫలమైనా రెండో ప్రయత్నంలో విజయం సాధించి జూనియర్ సివిల్ జడ్జ్‌గా ఎంపికైంది. ఆ యువతి పేరే వీ. గీతా భార్గవి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ అనే మారుమూల గిరిజన ప్రాంతం ఈమె స్వస్థలం. తండ్రి సామయ్య అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఆంధ్రా యూనివర్శిటీలో LLB చదివింది. అక్కడే LLM కూడా పూర్తిచేసింది భార్గవి.
స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న భవానీ కార్తీక్ - స్వర్ణ పతకాలతో సవాల్
న్యాయమూర్తి కావాలనే లక్ష్యం : తండ్రి కోరిక మేరకు న్యాయమూర్తి కావాలని చిన్నప్పుడే సంకల్పించింది భార్గవి. తండ్రికి తరచూ బదిలీలు కావడంతో విద్యాభ్యాసానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు ఆ యువతి. న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివింది. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో రెట్టింపు ఉత్సాహంతో చదివి ఏపీ జూనియర్ సివిల్ జడ్జ్‌గా అర్హత సాదించింది.
పరీక్షకు సన్నద్ధం అవుతున్న సమయంలో అనారోగ్యానికి గురైంది గీతాభార్గవి. పరీక్షకు 20 రోజుల ముందు వరకూ ఆసుపత్రిలో చికిత్స పొందింది. కానీ, చదువును నమ్ముకున్న గీత.. పరీక్షకు హాజరై అద్భుతమైన విజయం సాధించింది. ప్రణాళికబద్ధంగా చదివితే ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారని అంటోందీ నూతన మహిళా న్యాయమూర్తి.
LLM పూర్తయిన తరువాత ప్రిపరేషన్ మొదలు పెట్టాను. నాన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావటం వల్ల ఎప్పుడూ న్యాయ వ్యవస్థ గురించి చెబుతూ ఉండే వారు. అలా వింటూ లా చేయాలనే కోరిక కలిగింది. ఒక టైం టేబుల్ ప్రకారం రోజూ చదివేదాన్ని. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలం అయ్యాను. తరువాత మరింత కష్టపడి చదివి జూనియర్ సివిల్ జడ్జ్‌గా అర్హత సాధించాను." - వీ. గీతా భార్గవి, న్యాయమూర్తిగా ఎంపికైనా యువతి
చిన్నప్పటి నుంచే సమాజసేవతో ముడిపడిన రంగంలోకి వెళ్లాలని భావించింది గీతాభార్గవి. ఏయూలో చదువుతున్న సమయంలో యూత్ పార్లమెంట్, డిబేట్, వ్యాసరచన పోటీలతోపాటు కొన్ని అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంది. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెబుతోంది గీతా. సన్నద్ధత సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒత్తిడికి గురికావొద్దని సూచిస్తోంది. వాటిని అధిగమిస్తే సత్ఫలితాలు సాధిస్తారంటోంది.
బ్యాడ్మింటన్, నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించిందీ గీతా భార్గవి. జూనియర్ సివిల్ జడ్జ్‌గా ఎంపికవ్వడం కెరీర్‌కి తొలిమెట్టుగా భావిస్తోంది. నిరుపేద అమ్మాయిలు న్యాయవాద వృత్తిలోకి రావాలని అప్పుడే ఆడవారిపట్ల అసమానతనలు తొలగించవచ్చని అంటోందీ యంగ్ లేడీ జడ్జ్.