Woman Rescued Three Girls From Drowning in Mahabubabad : ఈ మహిళ ధైర్యం చూస్తే సాహసం చేసింది డింభకా అనాల్సిందే ఎవరైనా సరే. ఎందుకంటే ఆ వీర వనిత చూపిన తెగువకు ముగ్గురు బాలికల ప్రాణాలు నిలిచాయి. వారిని కాపాడే క్రమంలో ఆమె ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ధైర్యంగా నీటిలో దూకి చిన్నారుల ప్రాణాలను రక్షించింది. అయితే అప్పటికే ఓ బాలిక నీట మునిగి మరణించింది. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు ప్రాంతం గౌతమబుద్ధ కాలనీలో శనివారం జరిగింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయితండాకు చెందిన బోడ వీరన్న, కుమారి దంపతులు గత మూడేళ్ల నుంచి పట్టణంలోని గౌతమబుద్ధ కాలనీలో గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారు. వారు కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో కూలీ పనులకు వారు శనివారం బయటకు వెళ్లగా ముగ్గురు కుమార్తెలు, అలాగే వీరన్న సోదరుని కుమార్తె దుస్తులు ఉతుక్కోవడానికి సమీప క్వారీ దగ్గరకు వెళ్లారు. అక్కడ క్వారీలో ఉన్న నీటి గుంత(Water Pit)లో దుస్తులు ఉతుక్కుంటూ ప్రమాదవశాత్తు నలుగురు నీళ్లలోకి జారిపోయారు.
![Woman Rescues Three Children](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-04-2024/21219951_water.jpg)
చిన్నారుల ఆర్తనాదాలు విన్న మహిళ : నీటిలో మునిగిన వారి ఆర్తనాదాలు విన్న సమీపంలోనే గుడిసెలో నివసిస్తున్న మహిళ నెరుసు ఉప్పలమ్మ అక్కడకు చేరుకుంది. క్వారీ గుంతలో మునిగిపోతున్న ముగ్గురు బాలికలను చూసింది. వెంటనే ఆ గుంతలో దిగి నీటిలో మునిగిపోతున్న వీరన్న ఇద్దరు కుమార్తెలు, వీరన్న సోదరుని కుమార్తెను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడింది. వీరన్న మరో కుమార్తె అప్పటికే నీటి గుంతలో అడుగుకి వెళ్లిపోవడంతో ఆమె బయటకు తీయలేకపోయింది.
అప్పుడు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని క్వారీ గుంతలో దిగి ఆ నీటి మధ్య భాగంలోని అడుగుకు వెళ్లి వెతకగా చిన్నారి దొరికింది. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు వారు గుర్తించారు. మరణించిన చిన్నారి(Children Died) బంచరాయి తండాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ముగ్గురు పిల్లలను కాపాడిన ఉప్పలమ్మను స్థానికులు అభినందించారు. అలాగే పోలీసులు సైతం ఆమె ధైర్య సాహసానికి మెచ్చుకొని, అభినందనలు తెలిపారు.
సోదరి ఎగ్జామ్ కోసం సాహసం- మంచులో 4కి.మీల 'రోడ్డు' వేసిన సోదరుడు!
ట్రాక్‌పై లారీ బోల్తా- రైలుకు ఎదురెళ్లి వృద్ధ జంట సాహసం- వందల మంది ప్రాణాలు సేఫ్!