Woman Ask to Help from Telangana Government : ఆ భార్యాభర్తలు చేరొక పని చేస్తూ ఉన్నంతలో సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. కానీ వారి జీవితానికి ఓ రోడ్డు ప్రమాదం అంధకారంలోకి నెట్టేసింది. నాలుగు పదుల వయసులోనే భర్త మంచానికి పరిమితం కావడం, అతడికి వైద్యం చేయించేందుకు ఇల్లాలు పడుతున్న అవస్థలు చూస్తే మనిషన్నవాడు ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఆ బాధలు వర్ణనాతీతం.
పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్టేషన్ బస్తీకి చెందిన ఎస్కే పాషా, రఫియాలకు పన్నెండేళ్ల క్రితం వివాహం అయింది. పాషా ఇల్లెందు పురపాలక సంఘంలోని చెత్త సేకరణ వాహన డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. రఫియా ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవారు. అప్పటివరకు వారి జీవితం సాఫీగానే సాగిపోతుంది. కానీ 2021లో ఇల్లెందు-రొంపేడు మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న పాషాకు ఒక్కసారిగా పంది అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడిపోయాడు.
తీవ్రగాయాలైన పాషా చికిత్స అనంతరం కోలుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ విధుల్లోకి చేరి గత సంవత్సరం నవంబరు వరకు పని చేశాడు. మళ్లీ డిసెంబరులో ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు రావడంతో పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోగా వెన్నెముకకు ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు తెలిపారు. గత ఆరేళ్లుగా వరంగల్‌లోని పెద్దాసుపత్రిలో చికిత్స చేయిస్తున్నా పాషా ఆరోగ్యం మాత్రం మెరుగుపడటం లేదు.
వెన్నెముక పనిచేయకపోవడంతో కొద్ది నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి భర్తను రఫియా చూసుకుంటుంది. అతనికి సపర్యాలు చేస్తూ పనికి వెళ్లడం లేదు. దీంతో పూట గడవడం కూడా కష్టమైపోతోంది. మరోవైపు నెలకు రూ.8 వేల వరకు మందులు వాడాల్సి రావడంతో తెలిసిన వారి వద్ద అప్పు చేస్తున్నారు. డాక్టర్ల సూచనలతో వ్యాయామాలు చేయించినా బాధితుడు కదల్లేని పరిస్థితి ఉంది. సంతానం లేని ఈ దంపతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి భార్య : నా భర్త కాళ్లకు స్పర్శ ఉంది. కానీ వెన్నెముక పని చేయడం లేదు. దీంతో శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. వ్యాయామాలు చేయిస్తూ మందులు వాడాలని చెప్పారు. ఆరు నెలలుగా మంచానికే పరిమితం కావడంతో వీపుపై పుండ్లు అయ్యాయి. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. నేనూ పనికి వెళ్లలేక పోతున్నాను. మాకు రేషన్‌కార్డు లేక ఆరోగ్య శ్రీ వర్తించడం లేదు. ఆరోగ్య శ్రీ కింద మెరుగైన వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సహకరించాలి. పింఛన్ మంజూరు చేయిస్తే కుటుంబం గడిచేందుకు వీలు కలుగుతుంది. అని రఫియా తెలిపారు.
Orphan Kids story in Yadadri : అనాథలైన ముగ్గురు చిన్నారులు.. ఆదుకోవాలని నానమ్మ వేడుకోలు