Medigadda Barrage Collapse News Latest : మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు నిర్మాణ సంస్థ 'ఎల్ అండ్ టీ' నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటి పారుదల శాఖకు వచ్చింది. తాము పని చేసిన ప్రాజెక్టుల్లో ఎక్కడా వైఫల్యం చెందలేదని ఎల్ అండ్ టీ ఉత్తరాఖండ్‌లో దాఖలు చేసిన ఓ టెండర్లో ధ్రువీకరణ ఇచ్చింది. అందులో మేడిగడ్డ గురించి కూడా ప్రస్తావించింది.
అయితే మేడిగడ్డ బ్యారేజీ స్ట్రక్చర్ దెబ్బ తిందని, ఈ పని ఎల్ అండ్ టీ చేసిందని పత్రికల్లో చూశామని చెప్పారు. ఈ వైఫల్యానికి ఆ సంస్థ బాధ్యతతో ఉందో లేదో చెప్పాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ లేఖ రాసింది. పనికి సంబంధించి ఆ సంస్థకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ధ్రువీకణ పత్రం సరైందో కాదో తెలపాలని కోరింది.
ఎన్డీఎస్ఏ తాత్కాలిక నివేదిక : మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుకు ఇప్పటివరకు చేసిన పరిశీలన, అధ్యయనాలు, ఇంజినీర్లతో మాట్లాడిన అంశాల ఆధారంగా తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మత్తులపై రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. వర్షాకాలంలోగా మేడిగడ్డతో సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకి తీసుకోవాల్సిన చర్యలను రాష్ట్రానికి తెలిపింది.
2019 జూన్‌లో ఆనకట్టలో నీటిని నిల్వ చేసిన తర్వాత వర్షాకాలం ముగిశాక దిగువన ఉన్న సీసీ బ్లాక్స్, ఆప్రాన్ దెబ్బతిన్నట్లు తెలిపింది. అయితే నీటిని వదిలి మరమ్మత్తు చేయాల్సి ఉన్న అలా నీటిని నిల్వ చేసి ఆనకట్ట కుంగుబాటుకు కారణమయ్యారని చెప్పింది. బ్యారేజ్‌లోని 20వ నంబర్ పియర్‌లో 1.2 మీటర్ల కంటే ఎక్కువగా కుంగిందని అందులో భారీగా పగుళ్లు ఏర్పడ్డాయంది. అలాగే ఏడో బ్లాక్‌లోని 8 గేట్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని పేర్కొంది.
ఒకవేళ 7వ బ్లాక్‌కి మరమ్మత్తులు చేసినా అవి తాత్కాలికం మాత్రమేనని మళ్లీ కదలికలు, మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని కమిటీ వివరించింది. వర్షాకాలం నాటికి ముందే బ్యారేజీ గేట్లపై ఒత్తిడి పడకుండా ఏడో బ్లాక్‌లోని అన్ని గేట్లను పూర్తి తెరవాలని చెప్పింది. 20వ పియర్‌కు ఇరువైపులా ఉన్న 20, 21 గేట్లకు గరిష్ఠ నష్టం జరిగినందున వాటిని కటింగ్ చేసి పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఏడో బ్లాక్‌లోని 20 పియర్ కుంగి దెబ్బ తిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించి అధికారుల ద్వారా వివరాలను సేకరించారు.
'గుత్తేదారు స్పందించకపోతే - అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు' - Judicial Inquiry On Kaleshwaram