Minister Nimmala Rama Naidu Fire on Fake News on Amaravathi: అమరావతి ముంపు ప్రాంతమనే జగన్ కలను సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదమూ లేదని స్పష్టం చేశారు. కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్లు తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 11.5 లక్షల క్యూసెక్కులు పోటెత్తినా అమరావతి చెక్కుచెదరలేదని మంత్రి వివరించారు. అమరావతిపై విషం చిమ్మడం వైఎస్సార్సీపీకి మొదట్నుంచీ అలవాటేనని ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని మంత్రి నిమ్మల సూచించారు.
కృష్ణా కరకట్టపై మంతెన ఆశ్రమం వద్ద షట్టర్‌కు ఐదేళ్లుగా గ్రీజ్ పెట్టలేదన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు 4 బోట్లు కొట్టుకురావటం వెనుక వైఎస్సార్సీపీ కుట్ర ఉండొచ్చని మంత్రి చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు అంత దుర్మార్గం చేయగల ఘనులేనని విమర్శించారు. బ్యారేజ్ వద్దకు గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు వస్తున్నారని తెలిపారు. రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మతు పనులు చేస్తారన్నారు. బుడమేరుకు పడిన 3 గండ్లను ఈ రాత్రికి పూడ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
విజయవాడ నగరంలోకి భారీ వరద వచ్చేందుకు గత ప్రభుత్వ తప్పులు, పాపాల ఫలితమేనని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన తీవ్ర నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా వరద వచ్చిందన్నారు. బుడమేరు వరదను కృష్ణాకు మళ్లించే పథకాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి మెజారిటీ పనులు పూర్తి చేశామన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం బుడమేరు మళ్లింపు పథకాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. పనులు పూర్తికాకపోవడం వల్లే 35 వేల క్యూసెక్కుల వరద వెళ్లేందుకు వీలులేక గండ్లు పడి బెజవాడను ముంచేసిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బుడమేరు కాలువకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చేందుకు పనులు చేపట్టామన్నారు. భవిష్యత్తులో గండ్లు పడకుండా కట్ట పటిష్టంగా ఉండేలా పనులు చేస్తామన్నారు. బ్యారేజీ దిగువన రిటైనింగ్ వాల్ పొడిగించి నిర్మించే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా నదికి ఎంత వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టను పటిష్టం చేస్తున్నామన్నారు. కరకట్టపై 4 లైన్ల రహదారి నిర్మించి పటిష్టం చేసే పనులు ముమ్మరం చేస్తామన్నారు.
వరద బాధితులకు మంత్రుల భరోసా- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా - MINISTERs REVIEW ON FLOODS
ఇంత వరదనీరు ఎప్పుడూ చూడలేదు: కృష్ణా నదిలో ఇంత వరదనీరు ఎప్పుడూ చూడలేదని మంత్రి నిమ్మల అన్నారు. 1998, 2009 కంటే ఎక్కువగా ఇప్పుడు వరద నీరు వచ్చిందని చెప్పారు. వరద ప్రాంతాల్లో సమర్థంగా సహాయ చర్యలు అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం స్వయంగా వరద ప్రాంతాల్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు.
"బుడమేరుకు గండ్లు గత ప్రభుత్వ పాలనా వైఫల్యమని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలుగా బుడమేరులో లైనింగ్, ఎక్స్‌టెన్షన్ పనులు చేయలేదు. కన్నయ్య నాయుడుని ప్రకాశం బ్యారేజీ వద్దకు తీసుకెళ్తున్నామని వివరించారు. అక్కడ అడ్డుకున్న పడవలను తీసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షోభ సమయాల్లో ఎలా పనిచేయాలో చంద్రబాబుకు తెలుసని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతల విమర్శలను పట్టించుకోమని మంత్రి నిమ్మల తెలిపారు.
కృష్ణానది వరద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కృష్ణా కరకట్ట, మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాల వద్ద ఏర్పడిన నీటి లీకేజీని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తాత్కాలిక కాంక్రీట్ గేట్ల ద్వారా లీకేజీకి అడ్డుకట్ట వేశామన్నారు. బుడమేర అప్రోచ్ రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న వారిని తాళ్ల సాయంతో కిందకు దించారు.
ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహానికి బోట్లు అడ్డుపడ్డాయి. ప్రవాహనికి బోట్లు కొట్టుకువచ్చి బ్యారేజ్ 67, 68, 69 పిల్లర్లను అడ్డుకొని ఆగిపోయాయి. దీంతో మూడు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నదిలో ఉన్న బోట్లను తొలగించి బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీకి తీసుకువస్తున్నారు. రాత్రికి ఇరుక్కుపొయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను పరిశీలించనున్నారు. కన్నయనాయుడు సలహా మేర బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.