Water Problems in Andhra Pradesh: రాష్ట్రంలోని అనేక పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా శివారు కాలనీల్లో ట్యాంకర్లే దిక్కుగా మారాయి. అనేక చోట్ల లెక్కపెట్టుకుని మరీ నీటిని వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా కావలిలోన అనేక కాలనీల్లో నీటి కష్టాలు ఉన్నాయి! ఇక్కడ ట్యాంకర్లు లేకపోతే పనిగడవడం లేదు! ఇలాంటి తిప్పలు తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సంగం బ్యారేజ్ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు 150కోట్ల రూపాయలతో పైపులైన్ పనులు చేపట్టంది. 20శాతం పనులు అప్పుడే పూర్తయ్యయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులు ఆపేసి బిల్లులు పెండింగ్ పెట్టడంతో గుత్తేదారు మొహం చాటేశారు.
గుంటూరులోని గోరంట్ల కొండపై 2017లో 33 కోట్ల రూపాయలతో సర్వీస్ రిజర్వాయర్ చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం 2019 నాటికి 20 కోట్లు నిధులు ఖర్చు చేసి, 60 శాతానికిపైగా పనులు పూర్తిచేసింది. తక్కెళ్లపాడులోని ప్రధాన తాగునీటి శుద్ధి ప్లాంటు నుంచి 12 కిలోమీటర్ల వరకూ పైపులైన్ పనులు పూర్తవగా, అక్కడి నుంచి కొండమీదికి 160 మీటర్ల మేర పైపులైన్ వేయాలి. వైసీపీ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలమేర బిల్లులు బకాయిలు పెట్టడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే గోరంట్ల, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతవాసులతో పాటు 4 వేల 700 టిడ్కోనివాస గృహాలు, 8 విలీన గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుంది. ఇది పూర్తికాకపోయేసరికి ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది.
విజయవాడ వాసుల నీటి వ్యధ - అయిదేళ్లూ మొద్దు నిద్రలోనే జగన్ సర్కార్! - Drinking Water problem
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తాగునీటి సరఫరా కోసం గత ప్రభుత్వం ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ సాయంతో 115 కోట్ల రూపాయల విలవైన పనులు చేపట్టింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో రిజర్వాయర్ పనులు పునాది దశ దాటలేకపోయాయి. పైపులైన్ పనులూ అసంపూర్తిగా ఉన్నాయి. కీలకమైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పనులు నేటికీ ప్రారంభించలేదు. ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఇంటికి ఒకట్రెండు బిందెలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది రానివ్వనని చిలకపలుకులు పలికిన ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు అక్కచెల్లెమ్మలు బిందెలతో నీళ్లు మోసుకుంటుంటే విషపునవ్వులు నవ్వుకుంటున్నారు. పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం.. గత తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అమృత్ పథకంతోపాటు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు సాయంతో 70 తాగునీటి పథకాలు చేపట్టింది. 6 వేల 526 కోట్ల రూపాయల విలువైన పనులనూ ప్రారంభించింది.
ఇవి పూర్తిచేస్తే తెలుగుదేశానికి ఎక్కడ పేరొస్తుందేమోని, జగన్ వాటిని పాడుబెట్టారు. రాష్ట్రప్రభుత్వ వాటా నిధులివ్వలేదు, కేంద్ర నిధులను దారిమళ్లించారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఈపాటికే అమృత్ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సాయంతో చేపట్టిన 18 తాగునీటి ప్రాజెక్టులను 2024 జూన్ 30కి పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్కటీ పూర్తిచేయలేదు. దాదాపు 200కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల, ఎక్కువ చోట్ల గుత్తేదారులు పనులు ఆపేశారు. వాటిలో సగమైనా పూర్తిచేసి ఉంటే వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పేవి.
నందిగామలో నీటి కటకట - గొంతు తడపలేని శాశ్వత మంచినీటి పథకం - Drinking Water Problems