No Water in Reservoirs in Joint Karimnagar District : మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టిన గోదావరి నది మొత్తం 1,400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరి మన రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. కందకుర్తి నుంచి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అక్కడి నుంచి కడెం ప్రాజెక్టు మీదుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వైపు గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి పెద్దగా వరద రాకపోవడంతో ప్రాజెక్టులన్నీ నీరు లేక బోసిపోతున్నాయి.
గత వారంరోజులుగా కడెం నుంచి వచ్చే ప్రవాహంతో పాటు పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం జలాలపై ఆధారపడ్డ మధ్యమానేరు, దిగువమానేరుకు ఇప్పటి వరకు ఇన్‌ఫ్లోనే ప్రారంభం కాకపోవడంతో వెలవెలపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సామర్ధ్యం 80.50టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.57టీఎంసీలు మాత్రమే ఉంది.
కడెం ప్రాజెక్టులోకి మాత్రం ప్రవాహం ఉధృతంగా వస్తోంది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 7.62టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.76టీఎంసీలు ఉన్నాయి. వరద ప్రవాహం 12,335క్యూసెక్కులు కాగా వస్తున్న ప్రవాహం కంటే ఎక్కువగా 13,710 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీనితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వేగంగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనితో కేవలం వారం రోజుల్లోనే ప్రాజెక్టు జలకళ ఉట్టి పడుతోంది.
ఈనెల 18న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20టీఎంసీలకు గాను కేవలం 5.20టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీనితో ఆ జలాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం నానా తంటాలు పడింది. గత వారం రోజులుగా కడెం నుంచి ప్రవాహంతో పాటు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం నుంచి వచ్చే వరదతో 14.24 టీఎంసీలకు నీరు చేరాయి. అంతే కాకుండా ప్రవాహం భారీగానే వస్తోంది. కడెం ప్రాజెక్టు నుంచి 12,980 క్యూసెక్కులతో పాటు పరివాహక ప్రాంతం నుంచి 8,018 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీనితో మరో రెండు మూడు రోజుల్లోనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు కానీ? : ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరినా ఇప్పట్లో మాత్రం గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపించడం లేదు. దీంతో దిగువ ప్రాంతమైన జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎస్సారెస్పీ ద్వారా వరద నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మధ్యమానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.82టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫ్లో 524 క్యూసెక్కులే కొనసాగుతోంది. మానేరు వాగు లేదా మూలవాగు. ఎస్సారెస్పీ నుంచి నీరు వస్తే తప్ప మధ్యమానేరుకు వరద వచ్చే పరిస్థితి లేదు.
దిగువ మానేరు పరిస్థితి దారుణం : ప్రస్తుతం కేవలం 524 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. కరీంనగర్ దిగువ మానేరు జలాశయం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సామర్థ్యం 24టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.215 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మధ్యమానేరుతో పాటు మోయతుమ్మెద వాగు నుంచి ప్రవాహం వస్తేనే దిగువ మానేరు ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంత వరకు మోయతుమ్మెద వాగు కాని మధ్యమానేరు నుంచి చుక్కనీరు రాకపోవడంతో ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది.
వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ - క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం - Telangana irrigation projects
జూరాలకు భారీ వరద - 46గేట్లు ఎత్తి నీటి విడుదల - Heavy Flood Flow To Jurala