Water in Papikondala boat: గోదావరి నదిపై పర్యాటకులతో పాపికొండల విహారయాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటులోకి నీరు చేరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యాటకులు, నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం నుంచి ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులతో పాపికొండల విహారయాత్రకు బోట్లు వెళ్లాయి.
అసలేం జరిగిందంటే?:విహారయాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బోటు బచ్చలూరు- మంటూరు మధ్యకు వచ్చే సరికి గోదావరి నదిలో నుంచి బోటు ఇంజిన్ లోని నీటిని తోడి, కూలింగ్ చేసి బయటకు పంపించే పైపు (కూలింగ్ పైపు) పగిలిపోవడంతో బోటులోకి కొంతమేర నీరు చేరింది. దీంతో బోటులో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అక్కడి సమీప దూరానికి బోటును సురక్షితంగా చేర్చారు. బోటులోకి చేరిన నీటిని బయటకు పంపించిన అనంతరం పర్యాటకులను పోశమ్మగండికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై బోటు నిర్వాహకులు తమకు సమాచారం అందించారని కంట్రోల్ రూం అధికారి ఒకరు తెలిపారు. బోటు నిర్వాహకులు అప్రమత్తమవ్వడంతో పర్యాటకులకు ప్రమాదం తప్పింది.