Rayaparthy SBI Theft Case : తెలంగాణలోని వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాయపర్తి ఎస్‌బీఐలో రూ.13.61 కోట్ల విలువైన బంగారాన్ని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ముఠాలో ముగ్గురిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దొంగలను పట్టుకునేందుకు జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గత నెల 18న అర్ధరాత్రి బ్యాంకులో దొంగిలించిన బంగారంతో హైదరాబాద్ వెళ్తున్న దోపిడీ ముఠా ప్రయాణిస్తున్న వాహనం చెడిపోయింది.
దీంతో వేకువజామున 5 గంటల నుంచి ఆ వాహనంలోనే రెండు గంటల పాటు హైదరాబాద్-వరంగల్ రహదారిపై ఉండిపోయారు. ఈ క్రమంలో ముఠాలోని ఒకరు నేషనల్ హైవేపై పెట్రోలింగ్‌లో ఉండే లిఫ్టింగ్ వాహనానికి ఫోన్ చేశాడు. అలా సదరు వెహికల్‌కి రిపేర్లు చేయించారు. అనంతరం తాము అద్దెకుంటున్న జవహర్‌నగర్‌కు వెళ్లారు. ప్రధాన నిందితుడు మరో వాహనంలో అక్కడి నుంచి ఏడున్నర కిలోల బంగారంతో వేరే ప్రాంతానికి వెళ్లాడు. ముగ్గురు ముఠా సభ్యులు జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్‌ప్లాజా వద్ద ఒక నంబర్ ప్లేట్‌తో దాటారు. అదే బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద మరో నంబర్ ప్లేట్‌తో దాటి వెళ్లారు.
రెండు టోల్‌ప్లాజాల వద్ద సమయాన్ని పోలీసులు అంచనా వేశారు. ఒకే వాహనం రెండు నంబర్లతో వెళ్తున్నట్లు అనుమానించారు. ఆ వెహికల్ ఘట్‌కేసర్ వద్ద మరమ్మతులకు గురైనట్లు, జాతీయ రహదారుల లిఫ్టింగ్ వాహనానికి కాల్ చేసినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలోని సెల్‌టవర్‌పై దృష్టి పెట్టిన పోలీసులు ఇతర రాష్ట్రాల నంబర్ల నుంచి వెళ్లిన కాల్స్ డేటాను విశ్లేషణ చేశారు. నిందితులు మహారాష్ట్ర వైపు వెళ్తున్నారని అంచనాకు వచ్చారు.
Warangal SBI Robbery Case Updates : ఈ క్రమంలోనే నిందితులు మహారాష్ట్ర మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 2.52 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీ చేసిన బంగారంలో పెద్దమొత్తం ప్రధాన నిందితుడి వద్ద ఉండడంతో అతడి కోసం విస్తృతంగా గాలించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే బంగారం తన వద్ద లేదని, తన సోదరుడి వద్ద ఉందని చెప్పాడు. దీంతో అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో 108 చోరీ - సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్
వ్యాపారంలో నష్టం - రాత్రికి రాత్రి కోటేశ్వరుడు కావాలని ప్లాన్ - చివరికి ఏమైందంటే!