Voter Awareness in Telangana 2024 : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఊరూవాడా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే వజ్రాయుధం లాంటి ఓటు హక్కు తమ చేతిలో ఉన్నా, తమకు కావాల్సిన నాయకుడిని తామే ఎన్నుకునే సువర్ణావకాశం వారిదే అయినా చాలా మంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. బాధ్యతగా ఓటు వేయాల్సిన ఓటర్లు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నా ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుంది అనే భావన చాలా మందిలో ఉంది.
Lok Sabha Elections 2024 : ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించడం లేదు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు కూడా అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి. ప్రతి ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి రకరకాల కారణాలతోపాటు కొందరి ఓటర్లలో ఉన్న ఇలాంటి ధోరణి కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకమే. కొన్నిసార్లు ఒక్క ఓటు సైతం అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గత ఎంపీ ఎన్నికలో పాతబస్తీలో మరీ తక్కువగా 39 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు 61 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఒక్క చేవెళ్లలో 53.80శాతం ఓట్లు పోలవగా మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో 45 శాతం లోపే నమోదయ్యాయి.
ప్రశ్నించే హక్కు ఎక్కడ? : ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం బలహీన పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ధైర్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఆయా సమస్యలను నేరుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా అన్ని ప్రధాన పార్టీలు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలను తయారు చేసి కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పంచుతున్నారు. తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల గెలిచిన అభ్యర్థి ఆయా సమస్యలపై దృష్టి పెట్టకపోతే నిలదీసే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అసలు ఓటే వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లేనని నిపుణులు వివరిస్తున్నారు.
నోటా ఉంది కదా? : ఒకవేళ ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లో ప్రతి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో నోటా ఓట్లు నమోదయ్యాయి. నోటా ద్వారా తమ పనితీరు నచ్చక ప్రజలు ఎక్కువ శాతం నోటాను ఎన్నుకుంటున్నారని అభ్యర్థుల్లో బాధ్యతను గుర్తు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.