Volunteers on YSRCP Manifesto: నెలకు 5 వేల రూపాయలిస్తూ నాలుగున్నరేళ్లు గొడ్డు చాకిరీ చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్, తాజా మేనిఫెస్టోలో తమకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుతామని ప్రస్తావించకపోవడంపై వాలంటీర్లు మండిపడుతున్నారు. వాలంటీర్లలో డిగ్రీ, పీజీలు చేసినవారు చాలా మందే ఉన్నారు. మేనిఫెస్టోలో తమ వేతన పెంపు గురించి మాట్లాడకపోగా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనపై కూడా ఎలాంటి భరోసా లేకపోవడం వారిని మరింత కుంగదీసింది.
కనీసం ఆ మాట కూడా చెప్పలేదు: బహిరంగ సమావేశాల్లో వాలంటీర్లు నా సైన్యం, నా కార్యకర్తలు, నా మనుషులని జగన్ అంటున్నారని, కానీ కనీసం వేతనం పెంచుతానని మేనిఫెస్టోలో హామీ కూడా ఇవ్వలేదని, పైగా రాజీనామాలు చేయిస్తున్నారంటూ ఓ వాలంటీర్ మండిపడ్డారు. ఎన్డీయే కూటమి వేతనం రూ.10 వేలకు పెంచుతామనే హామీ అయినా ఇచ్చిందని, జగన్ కనీసం ఆ మాట కూడా చెప్పలేదని అంటున్నారు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితేంటని, మనమంతా రాజీనామా చేయకుండా ఉంటే వచ్చే ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉంటుందని ఓ వాలంటీర్ వాట్సప్ గ్రూప్‌లో సందేశం పెట్టారు.
వాలంటీర్లు ఏమైనా వైఎస్సార్సీపీ బానిసలా: రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, మహిళా వాలంటీర్లు ఏమైనా ప్రచారం చేస్తారా అంటూ మహిళా వాలంటీర్ ప్రశ్నించారు. పేద బతుకులతో ఆడుకోవడం మంచిది కాదని, రాజీనామాలు చేయమనడం అమానవీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజీనామా ఎందుకు చేయాలని, వైఎస్సార్సీపీ కోసం తిరగాల్సిన అవసరమేంటని మరో వాలంటీర్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఒకరేమో వాలంటీర్లు బచ్చాగాళ్లు అంటారని, మరొకరేమో పార్టీ కార్యకర్తలు అంటున్నారని, వాలంటీర్లు ఏమైనా వైఎస్సార్సీపీ బానిసలా అంటూ నిలదీశారు.
99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP Fake Manifesto
సామాజిక మాధ్యమాల వేదికగా మండిపాటు: నెలకు 5 వేల రూపాయల వేతనమంటే సగటున రోజుకు రూ.165. ఈ మొత్తంతో కుటుంబాన్ని పోషించడం సాధ్యమవుతుందా? అయినా నాలుగున్నరేళ్లు ఇదే వేతనం ఇస్తూ కాలం గడిపారు. ఉద్యోగులు, ఇతర వర్గాలకు అయిదేళ్ల కాలంలో ఎంతో కొంతయినా జీతం పెరుగుతుంది. తమకు వేతనాలు సరిపోవడం లేదని, కొంతైనా పెంచాలని వాలంటీర్లు ధర్నాలు, నిరసనలు చేసినా జగన్ పట్టించుకోలేదు. పైగా వారిని స్వచ్ఛంద సేవకులంటూ కితాబిచ్చారు. ఇప్పుడు మరో అయిదేళ్ల కాలానికి ప్రకటించిన మేనిఫెస్టోలోనూ వారి వేతనాల పెంపు గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంటే అయిదేళ్లు గడిచిన తర్వాత కూడా వేతనాలు పెంచేందుకు ఆయనకు మనసొప్పలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా వాలంటీర్లు మండిపడుతున్నారు
ఇక మాట్లాడేదేం లేదు బ్రో: మేనిఫెస్టోలో వేతనాల ఊసే ఎత్తకపోవడంతో పలువురు వాలంటీర్లు తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ల ముఖచిత్రాలు ఏమిటో? అని ఒకరు ప్రశ్నిస్తే, విచారానికి, బాధకు మధ్యలో ఉన్నామంటూ మరొకరు సమాధానమిస్తూ ‘రాజా ది గ్రేట్’ సినిమాలోని డైలాగ్‌తో ఆడేసుకుంటున్నారు. మేనిఫెస్టో గురించి ఇక మాట్లాడేదేం లేదు బ్రో అని మరికొందరు సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
వైఎస్సార్సీపీ ఒత్తిళ్లకు తలొగ్గని వాలంటీర్లు: వాలంటీర్లను రాజీనామా చేయించి, పార్టీ ప్రచారానికి తిప్పుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు దాదాపుగా నెల రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. బెదిరింపుల దగ్గర నుంచి ప్రలోభాల వరకు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నా చాలా మంది వాలంటీర్లు తలొగ్గడం లేదు. ఇన్నాళ్లూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా వేతనాలిచ్చి, అదేదో పార్టీ నుంచి ఇచ్చినట్టు వారి కోసం పని చేయాలని చెప్పడంపై చాలా మంది గుర్రుగా ఉన్నారు.
చాలామంది ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలోనూ ఎక్కువ మంది వైఎస్సార్సీపీ అనుకూల ప్రచారానికి మొగ్గు చూపడం లేదు. కృష్ణా, నెల్లూరు, తదితర జిల్లాల్లో కొందరు రాజీనామా చేసి ఏకంగా టీడీపీలో చేరిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు కంగు తిన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 60 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వైఎస్సార్సీపీపై అనుకూలతతో రాజీనామా చేసినవారు 5 శాతం మించి ఉండరు.
కూటమి హామీతో భరోసా : పెరిగిన ధరలకు రూ.5 వేల వేతనం సరిపోవడం లేదని, పెంచాలని వాలంటీర్లు ఏడాది క్రితం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కొందరు వైఎస్సార్సీపీ నేతలు వారిని తూలనాడారు. వారి తీరు చాలా మంది వాలంటీర్లకు నచ్చకపోయినా ఏ ఉద్యోగమూ దక్కని పరిస్థితుల్లో కుటుంబ పోషణకు రూ.5 వేలు ఎంతో కొంత ఉపయోగపడుతుందని కొనసాగారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇది చాలా మందికి భరోసానిస్తోంది.
కొత్త సీసాలో పాత సారా- వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై టీడీపీ ఎద్దేవా - TDP Criticized to YCP manifesto