Volunteers Distributing Voter Slips: గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం (Election Commission), న్యాయస్థానాల ఆదేశాలను కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం కోటూరులో గ్రామ వాలంటీర్ శ్రీలత, బీఎల్వో (Booth Level Officer) నాగమణితో కలిసి ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేశారు.
వాలంటీర్లతో పాటు అధికార పార్టీకి చెందిన మరికొందరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి మేలు కలిగించేలా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
రాజీనామా చేసిన వాలంటీర్లకు తాయిలాలు - వైసీపీ బూత్ ఏజెంట్లుగా... - resigned volunteers services
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లతో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న బిఎల్వోలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ నేతలు సురేష్ నాయుడు, ఈవీ సుధాకర్ రెడ్డి, ముక్తీయార్లు డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల విభాగం సిబ్బందికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
ప్రొద్దుటూరులోని ప్రాంతాల్లో అనేక మంది బీఎల్వోలు వాలంటీర్ల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను వినియోగించొద్దన్న ఆదేశాలను ఉల్లంఘిస్తున్న బిఎల్వోలను గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని ప్రజలు న్యాయం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఇప్పటికే దీనిపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. అయినా సరే ఎన్నికల విధుల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాలను కొందరు అధికారులు, వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కి ఓ వాలంటీర్ కృష్ణా జిల్లా పామర్రులో ఓటర్ స్లిప్పులను పంపీణీ చేశాడు. దీంతో ఎన్నికల సంఘ ఆదేశాలను పక్కకు నెట్టి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న వాలంటర్పై పలువురు ఈసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టారు.
ఓటర్లకు అందించే ఓటరు స్లిప్పులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాల్సిన బీఎల్వో రాజునే వాలంటీరుని భాగస్వామ్యం చేసినట్లు విచారణలో తెలింది. ఈ మేరకు బీఎల్వో రాజుతోపాటు వాలంటీర్ ప్రసాద్‌ను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విధుల నుంచి తప్పించారు.