Vizianagaram Sisters Show Talent in Martial Arts Taekwondo and Fencing : అమ్మాయిలు చదువుతోపాటు ఆటల్లో రాణిస్తే జీవితంలో మరింతగా ఉపయోగపడుతుంది. తండ్రి ప్రోత్సాహంతో ఆ ఇద్దరు అమ్మాయి అదే మార్గం ఎంచుకున్నారు. చదువుకుంటూనే తైక్వాండో, ఫెన్సింగ్ క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మెరిశారు. లక్ష్యం నెరవేర్చుకోవడానికి మరింతగా సాధన చేస్తున్నారు.
విజయనగరానికి చెందిన శ్రీరూప్య, రేణుకలు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. తండ్రి మొక్కర శ్రీనివాసు అటవీశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇతడికి చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. కానీ, ఎదిగే క్రమంలో ఆర్థిక పరిస్థితులు అడ్డుపడ్డాయి. తన ఇద్దరు కుమార్తెలు ఆటలపై మక్కువ చూపడంతో పాఠశాల రోజుల నుంచే సాధన చేసేలా ప్రోత్సహిస్తున్నాడు.
చదువుతో పాటే ఉద్యోగాల వేట - ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటేలా శిక్షణ - Campus Recruitment Training
జాతీయస్థాయిలో సత్తా : తండ్రి శ్రీనివాసు నమ్మకం వమ్ము చేయకుండా పిల్లలు కూడా జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారు. పెద్ద కుమార్తె శ్రీరూప్య 11 సంవత్సరాల నుంచి ఫెన్సింగ్ ఆడుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఈమె ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 4 బంగారు, 6 వెండి, 3 కాంస్యాలు సాధించింది. జాతీయస్థాయిలోనూ సత్తా చాటుతూ 6 పతకాలు సొంతం చేసుకుంది. శ్రీనివాసు చిన్నకుమార్తె రేణుక ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతోంది. తైక్వాండో పోటీల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి కలిపి 19పతకాలు సాధించింది. అంతేగాక సోదరి శ్రీరూప్య ద్వారా స్ఫూర్తి పొంది ఫెన్సింగ్ నేర్చుకుంది. ప్రతిభతో నాలుగు సార్లు జాతీయ స్థాయిలో పాల్గొంది ఈ యువ క్రీడాకారిణి.
"పిల్లలు పట్టుదలతో ఆటల్లో రాణిస్తున్నారు. కానీ రవాణా, ఇతర ఖర్చుల కారణంగా కొన్ని సార్లు ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకుంటున్నాం. ఒకసారి వియత్నాం, జెకోస్లోవియాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు ఆర్థిక ఇబ్బందులు కారణంగా రేణుకను నేనే దూరం పెట్టాల్సి వచ్చింది. వీళ్లకి తగిన క్రీడా వసతులు కల్పించి ఆర్థిక సహాయం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతారు." - మొక్కర శ్రీనివాసు, శ్రీరూప్య, రేణ తండ్రి
అంతర్జాతీయంగా రాణించడమే లక్ష్యం : ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల ఆత్మరక్షణకు ఉపయుక్తమైన ఆటలెంతో ముఖ్యం. చదువుల్లో సత్తా చాటుతూనే ఆటల్లో ప్రతిభ చూపుతున్నారీ క్రీడారత్నాలు. ఫెన్సింగ్‌లో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు, జాతీయ స్థాయి 8వ ర్యాంకులో కొనసాగుతోంది శ్రీరూప్య. తండ్రి ఆశయ సాధనలో భాగంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తదుపరి లక్ష్యాలని చెబుతున్నారు ఈ అమ్మాయిలు.