Vizag Port Drug Container Safety: బ్రెజిల్ నుంచి ఆరు రకాల నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలతో 'డ్రై ఈస్ట్' విశాఖ పోర్టుకు దిగుమతి కావడం నిఘాసంస్థలను నిర్గాంత పోయేలా చేసింది. గత రెండు రోజులుగా నమూనాలు సేకరించాక, న్యాయమూర్తి సమక్షంలో తిరిగి 25 వేల కేజీల బ్యాగ్లను కంటైనర్లో ఉంచి ప్రత్యేక సీల్ వేశారు. ప్రస్తుతం ఈ కంటైనర్ వీసీటీపీఎల్ (Visakha Container Terminal Pvt Ltd) ప్రధాన గేటు కుడివైపు ఉన్న ఎగ్జామినేషన్ పాయింట్లోనే ఉంది. అత్యంత విలువైన సరకు కావడం, మున్ముందు కోర్టులో సరకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండటంతో కంటైనర్ భద్రత కీలకంగా భావించారు.
అయితే శుక్రవారం రాత్రి అక్కడి నుంచి తరలించాలని భావించినా సాధ్యపడలేదు. డ్రగ్స్ ఉందని నిర్ధారించిన సరకుతో కూడిన కంటైనర్‌ను 'ఆల్ వెదర్ ప్రూఫ్' (అన్ని రకాల వాతావరణం తట్టుకునే) ప్రదేశంలో నిల్వ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జేఎం భక్షి గ్రూప్ కేటాయించిన బెర్త్‌లో ఈ సదుపాయం లేదు. కం ఫ్రైడ్ స్టేషన్స్ (సీఎఫ్ఎస్)లో అలాంటి సదుపాయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. చల్లదనం, వేడి, సాధారణ వాతావరణం ఇలా వేర్ హౌస్‌ను బట్టి ఛార్జీ చేస్తారు. ఈ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు దానిని ఎక్కడ భద్రపరచాలనే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే - సీబీఐ నివేదికలో వెల్లడి - Visakhapatnam Drugs Case
ఏళ్ల తరబడి ఉన్న కంటైనర్లు: కంటైనర్ టెర్మినల్లో కస్టమ్స్, సీబీఐ సీజ్ చేసిన ఎన్నో కంటైనర్లు ఏళ్ల తరబడి ఉన్నాయి. అందులో ఎర్రచందనంతో దొరికిన కంటైనర్లు ఉన్నాయి. అయితే డ్రై ఈస్ట్‌లో వచ్చిన కంటైనర్ తెరిచి నమూనాలు పరీక్షించిన తర్వాత 'వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షంలో సరకు పాడైపోయే అవకాశం ఉంది. సరకును ఈ రోజుకు కంటైనర్లో ఉంచండి' అంటూ సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు సీబీఐ బృందాన్ని అభ్యర్థించారు.
అదే సమయంలో పోర్టు ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలం వద్ద గుమిగూడటం వల్ల విచారణకు జాప్యమైందని సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఎఆర్లో చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో కంటైనర్ భద్రతపై సీబీఐ ప్రత్యేక శ్రద్ద పెట్టింది. సీజ్ చేసిన కంటైనర్ భద్రతపై అనుమానమా? లేక అందులోని డ్రగ్స్ అవశేషాలు వాతావారణంకు దెబ్బతింటాయని భయమా? తెలియదు కానీ, సీబీఐ కట్టుదిట్టమైన భద్రతపై దృష్టి సారించింది.
కంటైనర్‌లోని సరకు నమూనాలు సేకరించకముందే, లాసన్స్ బే కాలనీలోని సంస్థ కార్యాలయంలో రికార్డులు సీబీఐ స్వాధీనం చేసుకుంది. మరోవైపు శుక్రవారం సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి కాకినాడ మూలపేట, వజ్రకూటంలో ఏడుగురు అధికారులు బృందం తనిఖీలు చేసింది. న్యాయమూర్తి సమక్షంలో సేకరించిన నమూనాలు దిల్లీలోని ల్యాబ్‌కు పంపనున్నారు. ఇప్పటికే సంధ్య ఆక్వా సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ, వ్యక్తుల పాత్రపై, బ్రెజిల్ నుంచి కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని ఎలా నౌక కదిలిందనే అంశాలపై క్షుణ్ణంగా ఆరా తీస్తోంది.
ప్రభుత్వంకు చెడ్డపేరు వస్తుందని, ఓ మంత్రి సలహాతో సీబీఐ విచారణలో ఉన్న సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు ఆగమేఘాలపై ఓ ప్రకటన శుక్రవారం విడుదల చేశారన్న విమర్శలున్నాయి. 'తమకు పార్టీలతో సంబంధం లేదని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాం' అంటూ ఎలాంటి అధికారిక సంతకం లేకుండా ఆ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాలనుకున్న యాజమాన్యం మళ్లీ వెనక్కి తగ్గింది.