Visakhapatnam Port Record : విశాఖ పోర్టు సరకు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. పోర్టు చరిత్రలోనే అత్యధికంగా 80.05 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకును రవాణా చేసిందని పోర్టు ఛైర్మన్ డా. ఎం అంగముత్తు వెల్లడించారు. 2023-24వ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల ఉండగానే ఈ ఘనతను తన ఖాతాలో నమోదు చేసుకుంది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. అత్యధికంగా సరకు రవాణా చేయడంలో పలు రంగాల్లో పురోగతి నమోదు చేసిందని పేర్కొన్నారు.
గత ఏడాదితో పోలుస్తే క్రూడ్ ఆయిల్ రవాణాలో 27 శాతం, ఇనుప ఖనిజం 12 శాతం, ఎరువులు 6 శాతం పెరుగుదలను నమోదు చేసిందని అంగముత్తు తెలియజేశారు. 43 భీమ్ కలిగిన బేబీ కేప్ నౌకలు గత ఏడాదితో పోలుస్తే అధికంగా ఇన్నర్ హార్బర్లో కార్యకలాపాలు నిర్వహించాయని పేర్కొన్నారు. పోర్టులోనికి వచ్చిన నౌకలలో సైతం 35 శాతం పెరుగుదల నమోదైందని తెలిపారు.
విశాఖ కంటైనర్ టెర్మినల్ (Visakha Container Terminal) 28 శాతం అధికంగా 6.65 లక్షల టీఈయులను హ్యాండిల్ చేసిందని అంగముత్తు వెల్లడించారు. ప్రీ బెర్తింగ్ డిటెన్షన్‌లో 68శాతం, టర్న్ అరౌండ్ టైం, అవుట్ పుట్ ఫర్ షిప్ బెర్త్ డేలో 10 శాతం, ఐడల్ టైం బెర్తింగ్లో 8 శాతం మెరుగుదలను నమోదైందని పేర్కొన్నారు. 2023 మే, జూన్, అక్టోబర్ , జనవరి 2024లో నెలలో అత్యధిక సరకు రవాణా రికార్డులను నెలకొల్పిందని ఈ సందర్భంగా వెల్లడించారు.
త్వరలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు: విశాఖ పోర్టు చైర్మన్
2024 జనవరి 19న ఒక్కరోజులో 4,03,978 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసి గత ఏడాది జూన్ 17న (4,01,875) నెలకొల్పిన రికార్డును తిరగరాసిందని అంగముత్తు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ పోర్టును ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోర్టు నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు, వాణిజ్యంలో నూతన విధానాలపై దృష్టి పెట్టామని వ్యాఖ్యానించారు. పోర్టు రోడ్లు నిర్వహణ, పార్క్‌ల నిర్మాణం, పచ్చదనం పెంపొందించే పలు పనులను చేపట్టినట్లు ఈ సందర్బంగా తెలియజేశారు. పోర్టు పరిసరాల పరిశుభ్రతకు, కాలుష్య నివారణకు పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం వల్ల దేశంలోని మేజర్ పోర్టులలో ప్రధమ స్థానంలో నిలిచిందని తెలియజేశారు.