Visakha People Complaints To RP Sisodia in YSRCP Land Grabs: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన త్వరలో రెవెన్యూ మ్యాపింగ్ సిద్ధం చేస్తామన్నారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల జారీ చేపడతామని స్పష్టం చేశారు. విశాఖలో భూ దోపిడీదారులపై తగు చర్యలు తీసుకుంటామని ఆర్పీ సిసోదియా తెలిపారు. కలెక్టరేట్‌లో వైఎస్సార్సీపీ భూ అక్రమాలపై బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు.
జనసేన నేత మూర్తి యాదవ్, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిరాజు, పలు అపార్ట్ మెంట్ అసోసియేషన్లు సిసోదియాను కలిసి వినతులు సమర్పించారు. గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వ, ప్రైవేటు భూములను దోచుకున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా 22-ఏను సాకుగా చూపి అమాయకుల దగ్గర నుంచి భూములను కారు చౌకగా కొట్టేశారని ఫిర్యాదు చేశారు. విశాఖ మధురవాడ క్రికెట్ స్టేడియం దగ్గరలో పది ఎకరాల భూమి అన్యా క్రాంతమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి పైడి రాజు ఆర్పీ సిసోదియాకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నేరెళ్ల వలస వద్ద భూమి కొనుగోలు చేస్తే స్థానిక రెవిన్యూ అధికారులు భూ బదలాయింపు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. తాడిచెట్లపాలెం సమీపంలో ఇల్లు కట్టుకోవడానికి సచివాలయ సిబ్బంది అనుమతుల పేరిట వేధిస్తున్నారని ఓ సామాన్యుడు ఫిర్యాదు ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన సిసోదియా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దస్పల్లా, హయగ్రీవ, శారదాపీఠం, రామానాయుడు భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు సిసోదియా తెలిపారు. 22-ఏ నుంచి తొలగించిన వాటితోపాటు ప్రస్తుత భూములపై దృష్టి సారించామన్నారు.
విశాఖ అభివృద్ధి చెందడంతోపాటు భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు జరుగుతుండటంతో భూముల విలువ బాగా పెరిగి కొన్ని సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వ భూములను కాపాడుకోవటమే ప్రత్యేక అజెండా. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి నగరం మొత్తానికి ఒక రెవెన్యూ మాపింగ్ సిద్ధం చేస్తాం. దీని వల్ల భూకబ్జాలు తగ్గుతాయి. - ఆర్పీ సిసోదియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
గత మూడు నెలలుగా 22 ఏ నుంచి భూములు ఉపసంహరణ జరగలేదన్నారు. విశాఖలో 2016 ఏకరాల భూమి ఫ్రీ హోల్డ్‌కు అర్హత ఉందని కానీ వాటిలో 626 ఎకరాలు మాత్రమే ఫ్రీ హోల్డ్ ఇచ్చారని సిసోదియా అన్నారు. హయగ్రీవ భూముల విషయంలో న్యాయ పరమైన అంశాలున్నాయన్నారు. రెవెన్యూ తరఫున అఫిడవిట్ వేయాల్సి ఉందన్నారు. ఎర్ర మట్టి దిబ్బల్లో ఏడు నీటి మార్గాల్లో రెండు మూసుకుపోయాయని అక్కడ పనులు ఆపాలని ఆదేశించినట్లు తెలిపారు. విశాఖలో భూముల మ్యాపింగ్‌పై ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భూముల కొనుగోలు దారులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నట్లు ఆర్పీ సిసోదియా చెప్పారు.
విశాఖలో భూముల కబ్జాలపై సిసోదియా ఆధ్వర్యంలో విచారణ - RP Sisodia Inquiry on Land Grabs