Village and Ward Secretariat Employees: ప్రభుత్వ వ్యవస్థల్ని పాలేర్లుగా చూస్తున్న వైసీపీ నాయకులు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకూ బాసుల్లా మారిపోయారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై, నాలుగున్నరేళ్లుగా దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. అడ్డగోలు పనులు చేయించుకుంటున్నారు. అభ్యంతరం చెప్పిన ఉద్యోగులపై, దాడులకూ తెగిస్తున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాల్ని భరించలేక, నాలుగున్నరేళ్లలో 6830 మంది ఉద్యోగులు కొలువులు వదిలేసి వేరే దారి చూసుకున్నారు. పాలనలో మార్చు తెచ్చానని గొప్పలు చెప్పే జగన్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని సొంతపార్టీ నాయకుల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు.
సత్యసాయి జిల్లా నల్లమడ మండలం ఎర్రవంకపల్లి సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ మురళి నాయక్‌పై 2023 జనవరిలో వైసీపీ నేత చేసిన దాడి. నేను చెప్పిన పని చేయ్యనంటావా అంటూ కార్యాలయంలోనే కొట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరం 26వ వార్డు సచివాలయ వీఆర్ఓ అశోక్‌పై స్థానిక వైసీపీ నాయకుడు సాకే నరసింహులు ఇలా దాడి చేశాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసుకున్న కంచెను తొలగించడమే తప్పన్నట్లు కార్యాలయంలోనే విధ్వంసం సృష్టించాడు.
ఇక కడపలో స్థానిక కార్పొరేటర్ శివకోటిరెడ్డి ఏకంగా సచివాలయ కార్యదర్శి చెంప చెళ్లుమనిపిచారు. కార్పొరేటర్ అనుచరులు ఫరీదానగర్ సమీపంలో, అక్రమంగా చేపట్టి ఇళ్ల నిర్మాణం ఆపమనడమే సచివాలయ ఉద్యోగిపాలిటశాపమైంది. ఇక ఉద్యోగుల సీట్లో కూర్చోవద్దని చెప్పినందుకు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ వార్డు సచివాలయ ఉద్యోగి వంశీకృష్ణపై, వైసీపీ వార్డు కన్వీనర్ కె. శ్రీనివాసులు 2023 జనవరిలో దాడి చేశారు.
వైసీపీ నాయకుల మాటవిని తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించనందుకు నెల్లూరు జిల్లా కావలి సచివాలయ వెల్ఫెర్ అధికారి భాస్కర్‌కు దక్కిన బహుమానమిది. మూడు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లతో ఆయన్ను, ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. తట్టుకోలేక ఇలా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పింఛన్ల మంజూలో తన మాట వినలేదనే కోపంతో శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ వాసుదేవ్‌ను ,వైసీపీ సర్పంచి భర్త గున్నయ్య ఇలా చితక్కొట్టారు. దివ్యాంగుడనే కనికరం లేకుండా కావరం ప్రదర్శించాడు.
ఇలా వైసీపీ నాయకుల చేతిలో తన్నులు తిన్నవాళ్లు కొందరైతే, ఒత్తిళ్లు భరించలేక ప్రాణాలమీదకు తెచ్చుకున్నవాళ్ల మరికొందరు. ధాన్యం సేకరణ ప్రారంభంకాకముందే గోతాలు ఇవ్వాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకురాలు ప్రసన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అధికార పార్టీ నేతలు చెప్పే అడ్డమైన పనులు చేయలేక, మానసిక ఒత్తిడితో మగ్గిపోయిన సచివాలయ ఉద్యోగులెందరో.! చెత్త పన్ను వసూలు లక్ష్యాల్ని అధిగమించలేక విశాఖ 30వ డివిజన్ వార్డు పర్యావరణ, పారిశుద్ధ్య కార్యదర్శి బి.చంద్రమోహన్ 2022 డిసెంబరులో మృతి చెందారు. సహచర ఉద్యోగులు రోడ్డెక్కి అప్పట్లో ఆందోళన చేశారు.
మంత్రులు లేకుండానే.. గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష
ఇలా ఒకరిద్దరు కాదు, వైసీపీ నేతల ఒత్తిళ్లు, వేధింపులు భరించలేక, నాలుగున్నరేళ్లలో 6830 మంది సచివాలయాల ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. పీజీలు, పీహెచ్‌డీలు, కోర్సులు చేసిన విద్యావంతులు సైతం ప్రభుత్వ ఉద్యోగమన్న ఒకే ఒక్క కారణంతో, సచివాలయాల్లో చేరారు. కానీ వైసీపీ నేతల దాడులు, వాళ్లు అప్పగించే పనులు చూసి.. ఎందుకు ఉద్యోగంలో చేరామా అనే మనోవేదనకు గురవుతున్నారు.
2019 అక్టోబరులో విధుల్లో చేరిన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ నిబంధనల ప్రకారం 2021 అక్టోబరులోనే ఖరారు చేయాలి. కానీ ప్రభుత్వం, 9 నెలలు ఆలస్యం చేసి 2022 జూన్‌లో ప్రొబేషన్ ఇచ్చింది. దీని వల్ల ఒక్కో ఉద్యోగి నెలకు 10 వేల రూపాయల చొప్పున 9నెలలకు 90 వేల రూపాయలు నష్టపోయారు. ఈ లెక్కన లక్షా 34 వేల మంది ఉద్యోగులు, 12వందల 6 కోట్లు రూపాయలు కోల్పోయారు. ప్రొబేషన్ కాలంలో ఏడాదికి ఒకటి చొప్పున, మూడేళ్లకు కలిపి ఇవ్వాల్సిన మూడు నోషనల్ ఇంక్రిమెంట్లనూ ప్రభుత్వం ఎగ్గొట్టింది.
రీడింగ్ రూం లో సచివాలయాలు - మూడున్నరేళ్ళు దాటిన ప్రత్యామ్నాయాల మాటే లేదు!