Vijayawada Young Woman Shailu Talent in Table Tennis: బాల్యమంతా క్రీడా మైదానంలోనే గడిపిందీ యువతి. రెండో తరగతిలోనే టేబుల్ టెన్నిస్ ఆటడం మొదలు పెట్టింది. ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయకుండా ఆహర్నిశలు శ్రమించింది. ఫలితంగా జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పతకాలతో పాటు స్పోర్ట్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది.
ఈ యువతి పేరు శైలు నూర్ బాషా. విజయవాడ స్వస్థలం. తల్లి ఆశాబి, తండ్రి ఖాళీం నూర్ బాషా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ గ్రౌండ్‌మెన్‌గా చేస్తూ అక్కడే నివసించేవారు. దీంతో చిన్నప్పటి నుంచి మైదానానికి వచ్చే ఆటగాళ్లతో పరుగులు పెట్టేది శైలు. అలా ఆటలపై ఆసక్తి పెంచుకుంది.
కుమార్తెకు ఆటలపై ఉన్న ఆసక్తి గుర్తించిన ఖాళీం ఎలాగైనా ఈమెను క్రీడాకారిణిగా చూడాలనుకున్నాడు. రెండో తరగతిలో చదువుతున్నప్పుడే టెబుల్ టెన్నిస్‌లో శిక్షణ ఇప్పించాడు. 2006లో టెన్నిస్ క్రీడ ప్రారంభించిన శైలు 2008లోనే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకుని ఔరా అనిపించింది.
రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన శైలు జాతీయ పోటీలకు ఎంపికైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2010లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 100 పతకాలు, జాతీయస్థాయిలో 15 పసిడి పతకాలు సహా 50 పతకాలు కైవసం చేసుకున్నట్లు చెబుతోందీ టెన్నిస్ క్రీడాకారిణి.
జాతీయ పోటీల్లో ప్రతిభ చూపిన ఈ టెన్నిస్ క్రీడాకారిణి అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొంది. 2018లో స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించింది. గతేడాది ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్, టీమ్ ఈవెంట్స్‌లో సత్తాచాటి 3 పతకాలను కైవసం చేసున్నట్లు చెబుతోంది శైలు. ఉద్యోగం చేస్తూనే ఎప్పటికప్పుడు ఆటలో పరిణతి చెందుతోందని శైలు కోచ్ అంటున్నారు. రోజూ సుమారు 8 గంటలు సాధన చేస్తూ 2023లో స్టేట్ నంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచినట్లు చెబుతున్నారు.
మైదానానికి వచ్చే ఆటగాళ్లు చూసి తన కుమార్తెను కూడా అలా తీర్చిదిద్దాలని భావించినట్లు శైలు తండ్రి చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు క్రికెట్ అసోసియేషన్, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అండగా నిలిచారని అంటున్నారు. తనకూ క్రీడలపై మక్కువ ఉండటంతో ఇద్దరు కుమార్తెలను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నాని చెబుతున్నారు.
అంతర్జాతీయ పోటీల్లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తుందీ టెన్నిస్ క్రీడాకారిణి. టేబుల్ టెన్నిస్‌లోని సౌకర్యాలను మెరుగుపరిస్తే ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని సూచిస్తోంది శైలు నూర్‌బాషా.
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai