Vijayawada Students Got MNC Jobs : మంచి కళాశాలలో చేరాలి. బాగా చదివి ఎంఎన్సీల్లో సాప్ట్‌వేర్ ఉద్యోగం సాధించాలి. విద్యార్థులు అందరిదీ ఇదే కల. కానీ, కొందరే ఆ కల సాకారం చేసుకుంటారు. వీఆర్ సిద్ధార్ధ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు సైతం ఇవే కలలు కన్నారు. కానీ అందుకోసం అహర్నిశలు శ్రమించారు. చదువుకుంటూనే ఎంఎన్సీ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసి అనంతరం ఉద్యోగాలు సాధించారు. ప్రతిభ నీ సొంతం ఐతే సాధ్యం కానిదంటూ లేదని నిరూపించారు.
ఉద్యోగం చేయడానికి అర్హతతో పాటు నైపుణ్యాలూ ఎంతో అవసరం. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగం సాధించాలన్నా వచ్చిన ఉద్యోగంలో మంచి జీతం ఉండాలన్నా అర్హతకు మించి ప్రతిభా నైపుణ్యాలే కొలమానం. అలాంటి జాబ్ స్కిల్స్‌ని కాలేజీలో చేరిన మొదటి నుంచే విద్యార్థులకు నేర్పిస్తోంది విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల. వారిలోని టాలెంట్‌ని వెలికి తీస్తూ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తోంది.
Skill Training in Siddhartha Colleage : ఈ మధ్య కాలంలో చాలావరకు సాప్ట్‌వేర్ కంపెనీలు కళాశాల క్యాంపస్‌ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేయడం తగ్గించేశాయి. దీంతో కాలేజీలోనే కొలువులో సాధించాలన్న చాలామంది విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతోంది. విద్యార్థుల కలను సాకారం చేసే దిశగా వీఆర్ సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాల డీమ్డ్ టు బి యూనివర్శిటీ కృషి చేస్తోంది. విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలు నేర్పిస్తూ వారి భవితకు బాటలు వేస్తోంది.
కళాశాలలో చేరిన విద్యార్థులకు మొదటి నుంచే సిలబస్‌తో పాటు జాబ్ స్కిల్స్‌ని వీఆర్ సిద్ధార్థ అధ్యాపకులు బోధిస్తున్నారు. స్టూడెంట్స్‌ని కోడింగ్ గ్రూపుల్లో చేర్చి సాధన చేయిస్తున్నారు. ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, డేటా స్ట్రక్చర్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, వర్చ్యువల్ రియాలిటీ, రోబోటిక్స్ టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకుని ఇంటర్వూలకు హాజరవుతున్నారు.
ఎంపికైన వారికి లక్షల్లో జీతాలు : కంప్యూటర్లతో బిజీగా గడుపుతున్న వీరంతా విద్యార్థులే అయినా చదువుకుంటూనే మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన ప్రతిభావంతులు. ప్రణాళిక ప్రకారం చదువుకుని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలోనే ప్రముఖ సంస్థలుగా పేరుగాంచిన జేపి మార్గోన్, మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేశారు. విద్యార్థుల ప్రతిభా నైపుణ్యాలు మెచ్చిన పలు కంపెనీలు లక్షల్లో జీతాల ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నాయి.
కళాశాలలో ఇచ్చిన ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ తమకెంతో ఉపయోగపడిందని ఇంటర్న్‌షిప్, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు అంటున్నారు. మొదటిసారి ఉద్యోగాల కోసం ఇంటర్వూలకు వెళ్లినప్పుడు కాస్త భయం వేసినా శిక్షణలో నేర్చుకున్న మెళకువలతో భయాన్ని అధిగమించినట్లు వివరిస్తున్నారు. చదువు కాక ముందే ఉద్యోగం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎస్సీ విభాగానికి చెందిన కీర్తి ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతోంది. రెండో ఏడాదిలోనే అమెజాన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేసి నెలకు రూ.35,000ల వేతనం పొందింది. మూడో ఏడాది అదే కంపెనీ నెలకు లక్ష రూపాయల వేతనం ఇస్తుందని కీర్తి చెబుతోంది.
"నేను వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్సీ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. నాకు జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. ఇంటర్న్‌షిప్ అవకాశం వచ్చింది. హైదరాబాద్‌లోని జేపీ మోర్గాన్ క్యాంపస్‌లో ఇంటర్వ్యూ చేశారు. మా కళాశాలలో మొదటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చారు." - త్రిభువనశ్రీ, విద్యార్థిని
విద్యార్ధులందరికీ ఉద్యోగం వచ్చేలా ఏటా ప్రణాళికలు రూపొందిస్తామని వీఆర్ సిద్ధార్థ కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. తగ్గట్లుగానే స్కిల్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ నిర్వహిస్తున్నాట్లు వివరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొంటున్నారు. చాలామందిలో ఉద్యోగ నైపుణ్యాలు కొరవడుతున్నాయని కంపెనీలు ఇంటర్వ్యూలకు వచ్చిన వారిని తిరస్కరిస్తున్నాయి. లేదా తక్కువ జీతం ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటున్నాయి. అయితే చదువుకునేటప్పుడే ఉద్యోగ నైపుణ్యాలు నేర్పిస్తే ఇటు విద్యాలయాలతో పాటు విద్యార్థులకు సైతం మేలు జరుగే అవకాశం మెరుగ్గా ఉంది.
రోడ్డుపైనే సాధన - విమర్శలు లెక్క చేయకుండా పతకాల పంట - Extensive Skills in Roller Skating