Vijayawada Railway Station Receives NSG 1 Status in AP : ప్రయాణికుల రాకపోకలు, వారికి అందుతున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వేస్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏటా రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు ఎన్ఎస్జీ (NSG-1 -Non Suburban Group 1) హోదా కేటగిరీ ఇస్తారు. దిల్లీ సహా కొన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న టాప్ రైల్వేస్టేషన్లకు మాత్రమే ఇప్పటి వరకు ఈ హోదా ఉండగా తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్ ఆ జాబితాల చేరింది. కేంద్ర ప్రభుత్వం విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఎన్ఎస్జీ 1 హోదా కేటాయించింది. రాష్ట్రంలో ఈ హోదా కలిగిన ఏకైక రైల్వేస్టేషన్ ఇదొక్కటే.
ఎన్ఎస్జీ-1 గుర్తింపు కలిగిన ఏకైక రైల్వేస్టేషన్ : ఎన్ఎస్జీ 1 హోదా కోసం విజయవాడ రైల్వే స్టేషన్ చాలా ఏళ్లుగా పోటీపడుతోంది. 2017-18లో కేవలం రెండు ప్రమాణాల్లో వెనకబడిపోయి హోదా చేజార్చుకుంది. ఐదేళ్ల తర్వాత 2023-24 రైల్వే బోర్డు తాజా సమీక్షలో రూ. 528 కోట్ల వార్షిక ఆదాయంతో ఎన్ఎస్జీ 1 హోదా ఒడిసిపట్టుకుంది. 2023-24లో దాదాపు 16.84 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారు. కొత్తగుర్తింపుతో దేశంలోని టాప్ 28 స్టేషన్లతో ఉన్న ఎలైట్ గ్రూప్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ చోటు దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత ఎన్ఎస్జీ 1 హోదా కలిగిన స్టేషన్ విజయవాడ మాత్రమే. ఇక్కడ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు, చక్రాల కుర్చీ సౌకర్యాలు, అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. బ్యాటరీతో నడిచే కార్ సేవలతో కూడిన దివ్యాంగ్ జన్ ఫ్రెండ్లీ స్టేషన్‌గా గుర్తింపు సైతం సొంతం చేసుకుంది.
సరుకు రవాణాలో ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డ్ - 160 రోజుల్లో 100 మిలియన్ టన్నులు
అదనపు నిధులు కేటాయించనున్న కేంద్రం : ఎన్ఎస్జీ 1 గుర్తింపు దక్కడంతో కేంద్రం మరిన్ని నిధులు అందించనుంది. వాటి ద్వారా ప్రయాణికులకు ఇంకా ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయ తరహాలో వసతులు మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. రైళ్ల రాకపోకల సంఖ్యను పెంచనున్నారు. దీనివల్ల స్టేషన్‌కు ఆదాయం పెరగడంతోపాటు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, చిరు వ్యాపారులకు మరింత లబ్ధి చేకూరనుంది.
రెండు నుంచి నాలుగు - విశాఖ-విజయవాడ రైల్వే ట్రాక్‌ల విస్తరణ - Vijayawada Visakha railway track