Vijayawada Kirana Shop Owner Murder: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. తమ కుమార్తె జోలికి రావద్దని మందలించిన తండ్రిని నడిరోడ్డుపై ఓ యువకుడు నరికి హత్య చేశాడు. కుమార్తె ఎదురుగానే ఆ తండ్రిని కర్కశంగా హతమార్చాడు. బృందావన్ కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.
తమ కుమార్తె జోలికి రావద్దని గతంలో నిందుతుని ఇంటికి వెళ్లి చెప్పినా అతడి తీరు మారడం లేదని, ఈ నేపథ్యంలోనే అతడు ఈ హత్యకు పాల్పడ్డాడని బాధిత కుటుంబం వాపోయింది. తన భర్త మరణించడంతో తమ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం: భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్ (56) బృందావన్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మణికంఠకు ఇన్‌స్టాలో శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తె పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్దిరోజులుగా ఆమె అతడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్రప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు.
గురువారం శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకుమార్తెలు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో వేటు వేశాడు.
రోడ్డుపై పడిన తండ్రిని ఆయన కుమార్తె పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ నరికాడు. ఆయన కుమార్తె ఎంత ఆపినా విచక్షణ లేకుండా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే పరారయ్యాడు. శ్రీరామచంద్రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మణికంఠను పోలీసులు అరెస్టు చేశారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇష్టం లేదన్నా వేధించాడని వ్యాపారి కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
భార్యపై అనుమానంతో కుమార్తెను పొట్టనపెట్టుకున్న కసాయి - FATHER KILLED HIS DAUGHTER
ఇలాంటి కూతురిని కనొద్దు - ఇద్దరు ప్రియులతో కలసి తండ్రిని చంపిన యువతి - DAUGHTER KILL FATHER