Vijayawada Kids Excelling in Karra Samu : ప్రాచీన యుద్ధవిద్య శిలంబంలో బెజవాడ చిన్నారులు భళా అనిపిస్తున్నారు . 11 ఏళ్ల ప్రాయంలోనే జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాల పండిస్తున్నారు. నిత్యసాధనతో విజయాలు కైవసం చేసుకుంటున్న చిన్నారులపై కథనం. చిన్నారులు కర్రలతో కొట్టుకుంటున్నారేంటి అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లే. ఈ ఇద్దరూ ప్రాచీన యుద్ధవిద్య శిలంబంలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు.
విజయవాడకు చెందిన సాత్విక్ నాలుగేళ్ల కిందట తన తండ్రితో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వాకింగ్ వచ్చాడు. అక్కడ కొందరు విద్యార్థులు కర్రసాము చేస్తుండటం బాలుడి నాన్న గమనించాడు ఆ విధంగా సాత్విక్‌కి శిక్షణ ఇప్పించాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారి జాతీయ, ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. గతేడాది బెంగళూరులో జరిగిన ప్రపంచ స్థాయి శిలంబం పోటీల్లో సింగిల్ స్టిక్ ,ఫైట్ ఈవెంట్లలో పాల్గొని బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఏషియన్ శిలంబం పోటీల్లోనూ సత్తా చాటాడు. తల్లిదండ్రుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని సాత్విక్ చెబుతున్నాడు.
"ఎనిమిది సంవత్సరాల నుంచి కర్రసాము నేర్చుకుంటున్నాను. నేను బంగారు పతకాలు సాధించారు. తిరుపతిలో జరిగిన పోటీలో బంగారు పతకం సాధించాను. మా నాన్న ప్రోత్సాహం వల్లే ఇక్కడి దాకా వచ్చాను. రోజూ నాలుగు గంటల పాటు సాధన చేస్తున్నాను.చదువులో సైతం ఏకాగ్రత పెరుగుతుంది. పోటీల్లో పాల్గొనే ముందు ఎక్కువగా సాధన చేస్తాను. తల్లిదండ్రుల సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చాను." - సాత్విక్, క్రీడాకారుడు
విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన హీనా ముకేశ్ జైన్ శిలంబంలో అద్భుత ప్రతిభ కనపరుస్తోంది. కర్రసాము బాలికలకు మనోధైర్యాన్ని ఇస్తుందనే ఉద్దేశ్యంతో హీనా తల్లి ఇందులో చేర్పించారు. ఐదేళ్లుగా శిలంబంలో సాధన చేస్తూ జాతీయ ,ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇప్పటివరకు 24 పతకాలు సాధించింది. కర్రసాముతో పాటు కత్తి యుద్ధంలో కూడా ఆ చిన్నారి నైపుణ్యం ప్రదర్శిస్తుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చానని చెబుతోన్న హీనా ఖేలో ఇండియాలో పతకం సాధించటమే తన లక్ష్యమని చెబుతోంది.
Vijayawada Karrasamu Players Story : చిన్నారులు ఇద్దరు క్రమం తప్పకుండా నిత్యం నాలుగు గంటల పాటు సాధన చేస్తుంటారని శిక్షకుడు శ్రీకాంత్ తెలిపాడు . జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతరించి పోతున్న ప్రాచీన యుద్ధవిద్యను మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, బాలికలు నేర్చుకోవడం వల్ల మనోధైర్యం వస్తుందని శ్రీకాంత్ వివరించారు.
ప్రాచీన యుద్ధ విద్యకు మళ్లీ వైభవం.. పతకాలతో దూసుకుపోతున్న యువత
Free Martial Arts Training For Women: మహిళల ఆత్మరక్షణే ధ్యేయం..కర్రసాము శిక్షణ