Vijayawada Gradually Recovering From Flood Water : వారానికి పైగా వరద నీటితో అల్లాడిపోయిన విజయవాడ క్రమంగా కోలుకుంటోంది. వరద నీటి నుంచి కాలనీలు క్రమంగా బయటపడుతున్నాయి. వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ముంపు ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. అలాగే ప్రతి ఇంటికీ ఆహారం, రేషన్ సరుకులు, నిత్యావసరాల వస్తువుల పంపిణీ వేగంగా సాగుతోంది. ఆపద కాలంలో ప్రభుత్వం ఆదుకుంటోందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు : సింగ్‌నగర్ సహా చాలా కాలనీల్లో వరద తగ్గుముఖం పట్టింది. ఇంకా వరద వీడని ప్రాంతాల్లో ఇంజిన్లు, మోటార్లతో తోడుతున్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ముంపు ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. 32 డివిజన్లలో మురుగు, చెత్త తొలగింపు చేపడుతున్నారు. ముంపుబారినపడిన 70 శాతానికి పైగా ఇళ్లల్లోని నీటిని ఇప్పటికే తోడేశారు. రహదారులను రాకపోకలకు అనుకూలంగా శుభ్రం చేస్తున్నారు. నడుము లోతు వరకు ఉన్న ప్రాంతాలకూ పారిశుద్ధ్య కార్మికులు, వాహనాలను పంపించి చెత్త, వ్యర్థాలు తొలగిస్తున్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు.
తక్కువ ధరకు అందుతున్నాయా? లేదా? : ఇంటింటికీ ఆహారం, రేషన్ సరుకుల పంపిణీ జోరుగా సాగుతోంది. నిత్యావసరాల కిట్లను పెద్దఎత్తున పంపిణీ చేస్తున్నారు. నిత్యావసరాలు పంపిణీ జోరుగా సాగుతోంది. నిత్యావసర వస్తువుల పంపిణీని మంత్రి అచ్చెన్నాయుడు పర్యవేక్షించారు. తక్కువ ధరకు కూరగాయలు అందుతున్నాయా? లేదా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్టినగర్ ఆహార, నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. సంచార రైతు బజార్ల ద్వారా వరద బాధితులకు అతి తక్కువ ధరలకే కూరగాయలు అందిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కూరగాయలు కొనుగోలు చేశారు. ఆపద కాలంలో ప్రభుత్వం నిత్యావసరాలు, కూరగాయలు అందించి ఆదుకుంటోందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"పారిశుద్ధ్య కార్మికులందరూ వరద బాధితల కోసం ఎంతో కష్టపడుతున్నారు. కాలువలను శుభ్రంచేసి చెత్త, వ్యర్థాలను తొలగిస్తున్నారు. వ్యాధులు రాకుండా వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. ఇళ్లల్లోని నీటిని తోడేసి శుభ్రం చేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికీ ఆహారం, రేషన్ సరుకులు, నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఆపత్కాలంలో ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు." - వరద బాధితులు
విజయవాడ 56వ డివిజన్ లో మంత్రి సవిత పర్యటించారు. ఆహార పొట్లాలు, నిత్యావసర సరకులు, ట్యాంకర్లతో తాగునీటి పంపిణీని మంత్రి పర్యవేక్షించారు. పాత రాజరాజేశ్వరి పేట మెయిన్ రోడ్డులో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను మంత్రి ప్రశంసించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి ఔషధాల పంపిణీపై ఆరా తీశారు.
మూగజీవాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం పెద్దఎత్తున ఆహారం తయారు చేసి పంపిస్తున్నారు. విజయవాడ వరద బాధితుల ఆకలి తీర్చేందుకు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమ నిర్వహకులు 8 రోజులుగా అన్నదానం చేస్తున్నారు. ముంపు ప్రాంతాలను దత్తత తీసుకుని నేరుగా ఆహారం అందిస్తున్నారు. విజయవాడలో సంభవించిన వరదలకు మనుషులతో పాటు మూగజీవాలు ఆహారం లేక అల్లాడిపోయాయి. అలాంటి వాటికి పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. బ్రీతింగ్, అనిమల్ వారియర్స్ వంటి సంస్థల ప్రతినిధులు మూగజీవాల ఆకలిని తీరుస్తూ మంచి మనస్సు చాటుకుంటున్నారు.