Vijayawada Government Hospital Superintendent Venkatesh Harassments : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్సీపీకి కొమ్ముకాసే అధికారుల ఆగడాలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడలేదు. ఆస్పత్రిలో ఇప్పటికీ వారు చెప్పిందే వేదం! ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎస్ఈ స్థాయి అధికారిని నియమించాల్సి ఉన్నా నిబంధనలు తుంగలో తొక్కి వెంకటేశ్‌ను నియమించారు. అప్పటి నుంచి అక్రమాలు, అరాచకాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీకు వ్యతిరేకంగా ఉండే సిబ్బందిపై వేధింపులు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. ప్రభుత్వం మారినా ఇప్పటికీ ప్రభుత్వాసుపత్రిలో వారి వేధింపులు ఆపలేదు.
రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో ఒకటైన విజయవాడ ఆస్పత్రిలో వందల మంది సిబ్బంది ఉన్నారు. వారితోపాటు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు వైఎస్సార్సీపీకు వేయించేందుకు సూపరింటెండెంట్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని పుష్కర్ హాలులో వరుస సమావేశాలు పెట్టి కమిటీలు వేశారు. వీటికి అధ్యక్ష, కార్యదర్శులను నియమించి వైఎస్సార్సీపీకు ఓట్లను వేయించే బాధ్యతలు అప్పగించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాల్గొతరగతి ఉద్యోగులందరినీ సూపరింటెండెంట్ వెంకటేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు.
మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుందని ఎవరైనా తోక జాడిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరో రెండేళ్లపాటు తాను ఇదే పోస్టులో ఉంటానని మీకు ఏ పని జరగాలన్నా నామీదే ఆధారపడి ఉంటుందని మరచిపోవొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంత్రి విడదల రజని, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి నాపై నమ్మకంతోనే నాకన్నా సీనియర్లు ఉన్నా సరే నన్నే సూపరింటెండెంట్‌గా నియమించారని వెంకటేశ్ దిగువ శ్రేణిని సిబ్బందిని బెదిరించారు. మీరు ఎవరికి ఓటు వేసినా, తనకు ఇట్టే తెలిసిపోతుందని, కడుపులో భయం పెట్టుకుని ప్రవర్తించాలని హెచ్చరించారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోనికి రాగానే నాకు ఇంత కన్నా పెద్ద పోస్టింగ్ వస్తుంది. అప్పుడు మీ అందరికీ అండగా ఉంటానని అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయిస్తాని హామీ ఇచ్చారు.
సూపరింటెండెంట్ వెంకటేశ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోవడంతో కొందరు ఉద్యోగులు గవర్నర్‌కు, ఉన్నతాధికారులకు ఎన్నికలకు ముందే లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు బయటపడటంతో సూపరింటెండెంట్ వెంకటేశ్ వైఎస్సార్సీపీ తొత్తుగా ఏ విధంగా పని చేశాడో తెలిసింది. ఆసుపత్రిలో సూపరింటెండెంట్ తనకు ప్రధాన అనుచరుడైన ఓ ఎమ్ఎన్ఓ షాడోగా పెట్టుకున్నారు. ఈ అనుచరుడే ఆసుపత్రిలో అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. ఆసుపత్రిలోని అన్ని వ్యవహారాల్లోనూ వసూళ్ల పర్వం భారీగా కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగుల ఫిర్యాదుతో ఎన్నికల ముందు విచారణ జరిగినా ఉన్నతాధికారుల ఆశీస్సులుండడంతో తూతూమంత్రంగా దర్యాప్తు చేశారు.
ప్రభుత్వం మారినా ఆ సూపరింటెండెంట్ తీరు మారలేదు. ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు రాయిదెబ్బ తగిలి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రాగా వైద్యులు రెండు కుట్లు వేసి, ఓ చిన్న ప్లాస్టర్ వేశారు. రెండు రోజుల్లో తగ్గిపోతుందని ఏ ప్రమాదం లేదని చెప్పారు. అదే విషయాన్ని బయటకు వచ్చి మీడియాతోనూ చెప్పారు. అదే ఆ వైద్యులు చేసిన తప్పన్నట్లు వారిపై కక్షగట్టిన సూపరింటెండెంట్ వేధింపులు తీవ్రతరం చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. వీరిలో ఓ సీనియర్ వైద్యుడికి సంబంధించిన గది మరమ్మతుల కోసం దరఖాస్తు చేసుకోగా సూపరింటెండెంట్ దానిని తిరస్కరించారు. మీ సొంత డబ్బుతో చేయించుకోండి, ఇదే మీకు శిక్ష అంటూ అందరి ముందే పరుషంగా మాట్లాడి, అవమానించినట్టు తెలిసింది.
ఓటమిని భరించలేక వైఎస్సార్సీపీ మూకల దాడి- టీడీపీ నేతలకు తీవ్రగాయాలు - YSRCP ATTACKS