Present Situation in Vijayawada: బుడమేరుకు వరద తగ్గడంతో విజయవాడలోని కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వారం రోజులుగా జలదిగ్బంధంలోనే మగ్గిన భవానీపురం, సితార సెంటర్, విద్యాధరపురం నుంచి క్రమంగా నీరు వెళ్లి పోతోంది. జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరీ పేట, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతంలో నీరు తగ్గింది. బుడమేరు కాలవకు పడిన గండ్లు పూడ్చివేయడంతో, కాలనీల్లో నీరు తగ్గిందని స్థానికులు తెలిపారు. ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డ తాము, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నామని తెలిపారు.
సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో పాదాలు తాడిసేంత వరద నీరు మాత్రమే నిలిచి ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వాంబే కాలనీలో క్రమంగా వరద తగ్గుతోంది. పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కార్మికులు ముమ్మరం చేశారు. కాలనీల్లో బ్లీచింగ్ చల్లే పక్రియ చురుగ్గా సాగుతుందని అధికారులు వెల్లడించారు.
బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎడమ గట్టుపై పూడ్చిన గండ్లను పటిష్టపరిచే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షం పడుతున్నా గండ్లు పూడ్చిన ప్రాంతంలోనే ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. దిగువకు ఎలాంటి సీపేజీ లేకుండా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో పులివాగుకు వరద ప్రవాహం పెరగడంతో, బుడమేరకు 2 వేల 800 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం గండ్లు పూడ్చివేయటంతో ఆ నీరు బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా నేరుగా కృష్ణా నదిలో కలుస్తోంది. గండ్లు పూడ్చిన ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గడంతో రాయనపాడు సమీప ప్రాంతాలన్నీ బయటపడ్డాయి.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
విజయవాడ నగరాన్ని బుడమేరు వదర చుట్టుముట్టిన్న సమయంలో వేలాది మంది ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరును వరద బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద సహయక చర్యల్లో చూపిస్తున్న చొరవ అభినందనీయమని బాధితులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వయస్సులో కూడా రాత్రి, పగలు తేడా లేకుండా తమ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ బాధితుల ఆవేదన, బాధలను కళ్లారా చూశారని పేర్కొన్నారు. సమయంతో పాటు పరుగులు పెడుతూ అధికార యాంత్రాంగాన్ని పని చేయించారని కొనియాడారు. వరదతో బయటకు వెళ్లలేని సమయంలో తమకు ఆహరం, నీళ్లు, పిల్లలకు పాలు, మందులు వంటి వాటిని ఇంటికే తీసుకువచ్చి ఇచ్చారని, ఆయనకు రెండు చేతులూ ఎత్తి దండం పెడుతున్నామని అన్నారు.
మరోవైపు వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి తమకు తొచిన విధంగా వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారికి ఆహారం అందించడంతో పాటు చిన్నారులకు పాల ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. వరద తగ్గుముఖం పడుతుండటంతో వరద బాధితులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యంతో పాటు ఉల్లిపాయాలు, మంచినూనె, కందిపప్పు, బంగాళ దుంపలు, పాలు వంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తుంది.
వరద బాధితులందరికి రేషన్ కార్డు ద్వారా లేదా ఆధార్ కార్డు ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆధార్ నంబర్ ఉన్నా వస్తువులు ఇస్తున్నామని పెర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మెబైల్ వాహనాలను తీసుకువచ్చి బాధితులకు నిత్యసరాలు అందిస్తున్నారు. ప్రజలు తప్పని సరిగా నిత్యసరాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని విజయవాడ బుడమేరు వరద ముంపు బాధితులు అంటున్నారు. ప్రకృత్తి విపత్తు సమయంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అభినందనీయమని కొనియడారు.
రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert