Autonagar Workers Problems: ఆసియా ఖండంలోనే పారిశ్రామికవాడల్లో విజయవాడ ఆటోనగర్ అతి పెద్దది. ఇక్కడ కార్మికుల ప్రధాన జీవనాధారాల్లో లారీ బాడీ బిల్డింగ్ ఒకటి. టీడీపీ హయాంలో బాడీ బిల్డింగ్ పనులు, కార్మికులతో ఆటోనగర్ కళకళలాడేది. ప్రస్తుతం వాహనాల ఉత్పత్తిలో వచ్చిన మార్పులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ విచ్చలవిడి పన్నుల మోతతో లారీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఉపాధి అవకాశాలు లేక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపరించిందని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం మారితేనే తమ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వ అనాలోచిత పన్నుల విధానంతో రాష్ట్రంలోని లారీల బాడీ బిల్డింగ్ విభాగంలో పని చేస్తున్న కార్మికులు రోడ్డునపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లారీ యజమానులు, బాడీ బిల్డింగ్ కార్మికులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. అలాంటిది జగన్ సర్కార్ గద్దెనెక్కాక రోడ్డు, టోల్ ట్యాక్స్, గ్రీన్ టాక్స్‌ల పేరిట పన్నుల భారాన్ని భారీగా మోపారు. అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిలిపేయడంతో పనులు లేక లారీ యజమానులు చతికిలపడ్డారు.
తాగేందుకు నీళ్లు లేవు - సమస్యలతోనే సావాసం - ఆటోనగర్‌లో కార్మికుల కష్టాలు
ఫలితంగా ఐదేళ్లలో చాలా మంది లారీలను అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఉన్నవి కూడా చిన్న చిన్న మరమ్మతులకు మినహా బాడీలు కట్టించుకోవడానికి రావడంలేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక బతుకుతెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఐదేళ్ల క్రితం వరకు విజయవాడ ఆటోనగర్ వేలాదిమంది కార్మికులకు జీవనోపాధి కల్పించేది. లారీల బాడీల తయారీ ముమ్మరంగా జరిగేది. ఒక బాడీ తయారీకి సుమారు 35మంది కార్మికులు పనిచేసేవారు. అందులో వెల్డింగ్, ఎలక్ట్రికల్, ఉడ్‌వర్కింగ్, సీలింగ్, పెయింటింగ్, టింకరింగ్, మెకానిక్ పనులు చేసేవారుంటారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాడీ బిల్డింగ్ యూనిట్‌లు మూతపడటంతో కార్మికులకు పూర్తిస్థాయి ఉపాధి కరవయ్యింది.
'మురుగు'తున్న ఆటోనగర్- నెలల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలతో స్థానికుల అవస్థలు
డీజిల్, టోల్‌గేట్ ఛార్జీలు అధికమవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి బాడీలు కట్టించుకునేందుకు వచ్చే లారీలు తగ్గిపోయాయి. చిన్న చిన్న మరమ్మతులను వారికి సమీపంలోని బాడీ తయారీ కేంద్రాల వద్దనే చేయించుకుంటున్నారు. దీంతో ఉపాధి లేక వారంలో సగం రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోందని లారీ బాడీ బిల్డింగ్ యజమానులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ లారీ బాడీ కట్టే యూనిట్లు అధికంగా వెలిశాయి. దీంతో కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోయి యజమానుల సంఖ్య తగ్గిపోయింది. ఓవైపు ఉపాధి లేక ఇప్పటికే ఆటోనగర్‌లో కొన్ని లారీ బాడీ బిల్డింగ్ తయారీ కేంద్రాలు మూతపడగా మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
"జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాడీ బిల్డింగ్ యూనిట్‌లు మూతపడటంతో మాకు ఉపాధి కరవయింది. డీజిల్, టోల్‌గేట్ ఛార్జీలు అధికమవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి బాడీలు కట్టించుకునేందుకు వచ్చే లారీలు తగ్గిపోయాయి. చిన్న చిన్న మరమ్మతులను వారికి సమీపంలోని బాడీ తయారీ కేంద్రాల వద్దనే చేయించుకుంటున్నారు. దీంతో ఉపాధి లేక వారంలో సగం రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది." - కార్మికులు