Vigilance Investigation on Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పని పూర్తైనట్లు ఇచ్చిన ధ్రువీకరణపత్రంలో పేర్కొన్న మెజర్‌మెంట్ బుక్ (ఎం.బుక్) అసలు లేనే లేదని దర్యాప్తులో తేలింది. దీంతో తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావును కోరింది.
ఈ మేరకు బదులిచ్చిన ఈఈ, పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలు లేవని, పొరపాటున ఒక ఎం.బుక్(Measurement Book) నంబరు బదులు మరో ఎం.బుక్ నంబరు వేశామని పేర్కొంటూ విజిలెన్స్ ఎస్పీకి లేఖరాశారు. ఈ ఘటన సందర్భంగా మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Medigadda Barrage in Danger : 2019 జూన్‌లో సీఎం కేసీఆర్ మేడిగడ్డను ప్రారంభించారు. ఆ ఏడాది జనవరిలో కాళేశ్వరం మొదటి లింక్‌ను పరిశీలించిన ఆయన, బ్యారేజీకి సంబంధించిన అన్ని పనులను ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత లక్ష్యం మేరకు పని పూర్తిచేయడానికి రోజుకు పదివేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీని(L&T Company) ఆదేశించారు. బ్యారేజీ ఎగువన గైడ్‌బండ్స్, ఫ్లడ్‌బ్యాంక్స్ పనులను మార్చిలోగా పూర్తిచేయాలని సూచించారు.
మినిట్స్‌కు భిన్నంగా - మేడిగడ్డ పనులు : ఇందుకు సంబంధించిన మినిట్స్‌ను అప్పటి సీఎం ఓఎస్డీ, ఆ ఏడాది జనవరి 6న సంబంధితవర్గాలకు పంపారు. ఆ మినిట్స్‌లో వివరాలు అలా ఉండగా 56/2018 బిల్లుతోనే పని పూర్తయినట్లు, ఎలా ధ్రువీకరణ పత్రం(Certification) ఇచ్చారో తెలుసుకొనేందుకు దర్యాప్తు సంస్థ(Investigation Agency) సమాచారం కోరింది. ఆ ఎం.బుక్కే లేదని, టైపింగ్‌లో పొరపాటు జరిగిందని, వాస్తవానికి అది 65/2020 అని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు విజిలెన్స్‌కు సమాధానమిచ్చారు.
ఆ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. పని పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత పలు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు ఇంజినీర్లు లేఖలు రాసిన అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పని పూర్తైననట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో ఏ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తూ దర్యాప్తు సంస్థ అధికారుల వివరణ కోరినట్లు తెలిసింది.
మేడిగడ్డ కుంగిన తర్వాత వచ్చి చూడడం వల్ల ఏం లాభం : శ్రీధర్ బాబు
మేడిగడ్డపై దుష్ప్రచారాన్ని ఆపి - వర్షాకాలంలోపు మరమ్మతులు చేపట్టండి : బీఆర్ఎస్