Special Story On Venkat Foundation : పిల్లలు కూడా మొక్కల్లాంటివారే. కుటుంబమనే పాదులో ఆరోగ్యం అనే నారువేసి ప్రేమ అనే నీరు పోయాల్సినవారు. విద్య అనే సూర్యరశ్మిని పొంది వికసించాల్సిన వారు. పేదరికమో, కన్నవారి మరణమో ఇలా కారణం ఏదైనా సరే కొందరు పిల్లలకి ఆ పాదూ, నారూ, నీరూ, వెలుగూ దక్కవు. అలాంటివాళ్లకి మేమున్నామంటూ ముందుకొస్తున్నారు తెలుగురాష్ట్రాలకు చెందిన ఈ మంచి మనసున్నవారు. ఆ కోవకు చెందిన వారే కరీంనగర్‌కు చెందిన గంపా వెంకటేశ్.
అమ్మ స్ఫూర్తితో : కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా దేశమంతా తల్లడిల్లుతున్న సమయమది. చిన్నప్పుడే అమ్మనాన్నను కోల్పోయి ప్రభుత్వ హాస్టల్‌లో తలదాచుకుంటున్న సంతోష్‌ను నిర్వాహకులు వెళ్లిపొమ్మన్నారు. అతనికి ఆశ్రయమిచ్చి ఇంతముద్ద పెట్టడానికి బంధువులు కూడా ముందుకు రాలేదు. ఎటు వెళ్లాలో తోచని పరిస్థితిలో కరీంనగర్‌లోని ‘బాలగోకులం’ గురించి తెలిసింది సంతోష్‌కు. ఫోన్ చేసిందే తడవుగా అతడిని అక్కున చేర్చుకున్నారు ఆ సంస్థ నిర్వాహకులు. మూడేళ్లకిందట ఇక్కడికొచ్చిన సంతోష్ ప్రస్తుతం సివిల్స్‌కు సిద్ధం అవుతున్నాడు. ఈ విధంగా గత పదేళ్లలో ఎంతోమంది అనాథల్ని చేరదీసి ప్రయోజకుల్ని చేసింది బాలగోకులం. ఈ ఏడాది బాలగోకులంలో 40 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. 10 ఏళ్లు పైబడ్డ అనాథలు ఎవరైనా ఇక్కడికి వచ్చి, ఉద్యోగం సాధించేవరకూ ఏ బాదరబందీ లేకుండా ఉండొచ్చు.
Venkat Foundation Activities : పిల్లలకి ఇష్టమైన వంటలనే చేయాలన్న నిబంధన ఉంది ఇక్కడ. వాళ్లు బడికో, కాలేజీకో వెళ్లి వచ్చాక ఉదయం సాయంత్రం కోచింగ్ తరగతులనూ నిర్వహిస్తారు. కరీంనగర్‌కు చెందిన గంపా వెంకటేశ్ అనే వ్యాపారి ఈ బాలగోకులాన్ని ఏర్పాటుచేశారు. జీవించినంత కాలం అనాథలకీ, అభాగ్యులకీ సాయపడుతూనే ఉన్న తన తల్లి స్ఫూర్తితోనే ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారాయన. ఈ ఆశ్రమం పేరు ‘వెంకట్ ఫౌండేషన్’. నెలకి లక్షన్నర రూపాయల ఖర్చుతో ఈ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఆటో డ్రైవర్ గొప్ప మనసు - అలాంటి వారి కోసం నగరంలో ఉచితంగా మంచి నీటి పంపిణీ
Man Provides Free Coaching For Students : బ్లడ్ బ్యాంకులో పనిచేసే ఓ మాములు ఉద్యోగికి నిరూపేదలు, అనాథలైన పిల్లలు గురించి ఏదైనా మంచిపని చేయాలనే ఆలోచన వచ్చింది. నిరుపేదలు, అనాథపిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఏయే అవకాశాలు ఉన్నాయో బాగా తెలిసినవారు. ముఖ్యంగా ఏపీ ఆర్జేసీ - సెట్లో చదివితే ఎలాంటి పేద విద్యార్థికి అయిన మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందిచ్చవచ్చని గ్రహించాడాయన. పాలిసెట్‌లో విజయం సాధిస్తే వృత్తి నిపుణులుగా ఓ స్థాయికి ఎదగవచ్చని నమ్మి ఆ రెండింటి కోసం పూర్తి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు స్నేహిత అమృత హస్తం అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆయనే కడప జిల్లా పులివెందులకి చెందిన మొమ్మెల రాజు.
25 మంది విద్యార్థులతో : 14 ఏళ్ల క్రితం ఒక్క ఉపాధ్యాయుడు, 25 మంది విద్యార్థులతో కేవలం తన జీతంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు రాజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 5వేల మంది విద్యార్థులకు శిక్షణను ఇచ్చి ప్రవేశ పరీక్షలను రాయించారు. వందలాంది మందికి మంచి ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో చదివేందుకు మార్గం చూపారు. ఇప్పటికీ ప్రతీ ఏడూ 250 మందికి కోచింగ్ ఇస్తున్నారు. ఆయన చేస్తున్న మంచిపనికి తమ వంతు సాయంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న 35 మంది ట్రైనర్స్ ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తున్నారు.
స్కంధాన్షి పౌండేషన్ : కర్నూలు జిల్లాలో ఏదైనా ప్రమాదాల వల్లనో, తీవ్ర అనారోగ్యం వల్లనో ఎవరైనా చనిపోయారనే వార్తలు వస్తే- వాటి వార్తాపత్రిక క్లిప్పింగ్స్‌ను కట్ చేసి తీసిపెట్టుకుంటారు స్కంధాన్షి పౌండేషన్ సభ్యులు. మృతుల పిల్లలు ఏమయ్యారా? అని ఆరా తీయడం మొదలుపెడతారు ఆ పౌండేషన్ వారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోతేనో, ఒక్కరే మిగిలి ఆర్థికంగా బాధపడుతుంటేనో ఆ చిన్నారులను ఆదరించి అక్కున చేర్చుకుంటారు వారు.
విద్యే సమాజాన్ని మార్చే ఆయుధమని నమ్మి : కర్నూలు బిర్లా సర్కిల్లో ఉన్న తమ ఆశ్రమానికి తీసుకువచ్చి ఎంతదాకైనా చదివిస్తారు. పేరున్న కార్పోరేట్ పాఠశాలల్లోనూ చేర్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని చదివించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు కావాల్సిన ధన సహాయం చేసి వారిని ఆదుకుంటున్నారు. ప్రతిభ కల పిల్లల్ని ఇంజినీరింగ్, మెడిసన్ వరకూ ఉచితంగానే చదివిస్తున్నారు.
వీటన్నింటి కోసం నెలనెలా రూ.70 లక్షల వరకూ ఖర్చుచేస్తోంది స్కంధాన్షి ఫౌండేషన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడు కె.సురేశ్‌కుమార్‌రెడ్డి. ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి ఆయన స్వస్థలం. అక్కడి నుంచి ఒక్కో మెట్టూ ఎదుగుతూ కర్నూలులోనూ బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే విద్యే సమాజాన్ని మార్చే ఆయుధమనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ విద్యని అందుకోలేని అభాగ్యుల్ని, అనాథలూ ఆదుకోవాలన్న లక్ష్యంతోనే 2020లో స్కంధాన్షి ఫౌండేషన్‌ను స్థాపించారు. కనీసం 300 మందికైనా ఆశ్రయం కల్పించాలనేదే తన ఆశయమని ఆయన తెలిపారు.
అనాథలకు సినిమాలూ, పిక్నిక్కులు.. వారికి నేనున్నానంటున్న సంతోష్