Venkaiah Naidu About Ramoji Rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా మరోసారి పంచుకున్నారు. రామోజీతో కలిసి సాగిన జ్ఞాపకాలు మదిలో మెదిలి, మనసంతా ఓ చెప్పలేని భావనతో నిండిపోయిందంటూ రామోజీరావు దశదిన సంస్కారాల సందర్భంలో వెంకయ్యనాయుడు తన మనోగతాన్ని తెలిపారు.
'యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః | జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || భగవద్గీతలో చెప్పినట్లుగా కర్తృత్వ భావన లేకుండా కర్మ ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మలు చేసే వారు నిజమైన జ్ఞానులు. అలాంటి వారు లోకానికి ఎంతో ఉపకారం చేయగలరు. అలాంటి వారిలో రామోజీరావు ముందు వరుసలో నిలుస్తారు' అని వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు తన జీవితమంతా ప్రజాపక్షమే వహించారని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కలగన్నారని, ఆ దిశగా పత్రిక, ప్రసార మాధ్యమాల ద్వారా కృషి చేశారని కొనియాడారు.
ఎంతో మంది సాధారణ ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రామోజీరావు ద్వారా ప్రయోజనం పొందారని గుర్తు చేశారు. అక్షరంతో కలిసి నడిచి, అక్షరంతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిన ఆ "అక్షర యోగి" లేరన్న వార్తను జీర్ణించుకోవటం కష్టమే అని వాపోయారు. అయినప్పటికీ, కాలంతోపాటే సాగే క్రమంలో ఇలాంటి వాటన్నింటినీ దాటుకుని ముందు సాగాలని పేర్కొన్నారు.
రామోజీరావు పేరు వినగానే తనలో ఓ ఆత్మీయ భావన మొలకెత్తుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా అభిమానించే వారిలో రామోజీరావు పేరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు. దానికి గల కారణాల్లో వారి వ్యక్తిత్వం ఒకటైతే, సమయపాలన మరొకటని చెప్పుకొచ్చారు. తెలుగు భాష పట్ల వారికున్న ప్రేమ, గౌరవం, బాధ్యత మా మధ్య ఆత్మీయతను మరింత పెంచిందని ప్రస్తావించారు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి, అర్ధం చేసుకుని, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగే వారంటే తనకు ఎంతో గౌరవమని తెలిపారు. అంతకు మించిన ప్రేమ, అభిమానం నా పట్ల వారికి ఉన్నాయని అనేక సందర్భాలు రుజువు చేశాయని వెంకయ్యనాయుడు తెలిపారు.
పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - Venkaiah Naidu Padma Vibhushan
తాను ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న సమయంలో రామోజీరావు కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సందర్భంలో ఆయన నాతో మాట్లాడుతూ "మీరు రాజ్యాంగ పదవుల కంటే మంత్రి పదవిలో ఉంటేనే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నా నిశ్చితాభిప్రాయం. అయితే పార్టీ నిర్ణయం, వారికి మీరిచ్చే గౌరవం, మీ నిబద్ధత గురించి నాకు తెలుసు కాబట్టి మీరు ముందుకు సాగుతారని భావిస్తున్నారు. మీ వల్ల ఈ పదవికి మరింత వన్నె, గౌరవం చేకూరుతుందని భావిస్తున్నాను" అంటూ శుభాకాంక్షలు తెలియజేశారని వెంకయ్య నాయుడు ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.
ఫోటో ప్రస్తావన : నిజానికి తనకు ఫొటోలు దిగటం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అయితే, తాను మంత్రిగా ఉన్నప్పుడు తీసిన రెండు మూడు ఫోటోలను రామోజీరావుకు చూపించానని చెప్పారు. 'ఓ పత్రికాధిపతిగా వారి దృష్టిలో ఫొటో అంటే కేవలం ప్రతిరూపం కాదు, ఓ వాస్తవాన్ని ఆవిష్కరించే ప్రతిబింబం. అందుకే మంచి ఫోటో తీయించుకోవాలని సూచించటమే కాదు, విశాఖపట్నం నుంచి విల్లా అర్ట్స్‌కు చెందిన రమణను పిలిపించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న వారి ఇంట్లోనే ప్రత్యేక ఫొటో షూట్ చేయించి ఆ ఫొటోలతో పాటు ఆల్బమ్ నాకు అందజేశారు. ఆరోజు రామోజీరావు తీయించిన ఫొటోల్లో ఒకదాన్ని ఉపరాష్ట్రపతిగా అధికారిక ఫొటోగా వినియోగించటంతో పాటు వివిధ సందర్భాల్లో అందులోని కొన్ని ఫొటోలను వినియోగించుకున్నట్లు" వెంకయ్య తెలిపారు.
"పలు సందర్భాల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలతో పాటు అనేక విషయాల గురించి రామోజీరావుతో సవివరంగా చర్చించుకునే వాడిని. నిత్యం ప్రజల అభిప్రాయాలను లోతుల్లోకి వెళ్లి తెలుసుకునే పత్రిక నిర్వాహకులు కావటం వల్ల వారి మాటల్లోని లోతు, విశ్లేషణ ప్రత్యేకంగా ఉండేది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవటంలో అది నాకు ఎంతో ప్రయోజనకారిగా నిలిచింది. తెలుగు భాష ఉన్నతికి నిత్యం పరితపించే రామోజీరావు రూపంలో తెలుగు తల్లికి మరో బిడ్డ దూరమయ్యారు. ఆయన స్ఫూర్తి కచ్చితంగా తెలుగు భాషకు మరింత మేలు చేస్తుందని విశ్వసిస్తున్నాను. ఆ దారిలోనే వారి మానసపుత్రికలైన "ఈనాడు, ఈటీవీ" కొనసాగుతాయని ఆశిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి భగవంతుడు సద్గతులు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను." అని వెంకయ్యనాయుడు తెలిపారు.