Vehicles Fancy Numbers Craze in Telangana : ఈనెల 15 నుంచి వాహనాల నంబర్ ప్లేట్లను టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని టీఎస్ నంబర్ ప్లేటుతో ఉన్నవి అలాగే కొనసాగుతాయని తెలిపింది. దీంతో ఈ ఐదు రోజుల్లో రోజుకు రవాణా శాఖకు సుమారు కోటికి పైగా ఆదాయం సమకూరింది. దీనికి కారణం ఫ్యాన్సీ నంబర్లు (Fancy Numbers in Vehicles).
ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాకు అత్యధికంగా రూ.2 కోట్లు వచ్చాయి. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో రూ.85 లక్షలకు పైగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో రూ.64 లక్షలకు పైగా, సంగారెడ్డి జిల్లాలో రూ.41 లక్షల ఆదాయం వచ్చింది. ఫ్యాన్సీ నంబర్లకు ఫీజు రూపంలో రెండున్న కోట్ల రూపాయలు బిడ్ ధర మరో రెండున్నర కోట్ల రూపాయల వరకు మొత్తంగా రూ.5 కోట్లకు పైగానే ఆదాయం సమకూరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
స్కూటీ ధర రూ.71వేలు.. ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.15లక్షలు ఖర్చు
TG Vehicle Registration 2024 : హైదరాబాద్ సెంట్రల్ జోన్‌లోని బండ్లగూడలో TG12 0999 నంబర్‌కు రూ.1,30,009, TG12 0786 నంబర్‌కు రూ.74,786 ధర పలికింది. ఈ రెండు నంబర్లకు కలిపి రిజర్వేషన్ ఫీజు, బిడ్ ధర కలుపుకుంటే రవాణాశాఖకు రూ.3,32,295 ఆదాయం సమకూరింది. ఆర్టీఏ వెస్ట్‌జోన్‌లోని టోలీచౌక్ రవాణాశాఖ కార్యాలయంలో TG13 0001 నంబర్‌కు రూ.1,61,111 ధర పలకగా, TG13 1000 నంబర్‌కు రూ.60,000ల రేట్ పలికింది. ఈ రెండు నంబర్లకు రిజర్వేషన్ ఫీజు, బిడ్ ధర కలుపుకుంటే రవాణాశాఖకు రూ.5,38,511 ఆదాయం సమకూరింది. సౌత్ జోన్ రవాణాశాఖ కార్యాలయంలో TG12 0007 నంబర్‌కు రూ.44,500లు, TG12 0786 నంబర్‌కు రూ.74,786లు, TG12 0999 నంబర్‌కు రూ.1,30,009లు వచ్చాయి. ఈ మూడు నంబర్లకు కలిపి రూ.3,33,295ల ఆదాయం సమకూరింది.
"ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ వేస్తారు. టీఎస్ నుంచి టీజీగా మారిన తర్వాత వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడుతున్నారు. అన్ని జిల్లాలోనూ వీటి కోసం పోటీ నెలకొంది. ఫ్యాన్సీ నంబర్లకు ఫీజు రూపంలో రెండున్న కోట్ల రూపాయలు బిడ్ ధర మరో రెండున్నర కోట్ల రూపాయల వరకు మొత్తంగా రూ.5 కోట్లకు పైగానే ఆదాయం సమకూరింది." - రమేశ్, రవాణాశాఖ అధికారి
కారు ధర రూ.10 కోట్లు.. నెంబర్ రూ.60 కోట్లు
ఫ్యాన్సీ నంబర్లపై రోజురోజుకు ప్రజల్లో క్రేజ్ పెరిగిపోతుంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, అదృష్ట సంఖ్య, ఫ్యాన్సీ నంబర్‌ను హోదాగా భావించడం, న్యూమరాలజీ నమ్మేవారు ఇలా ఏది ఏమైనా తమ వాహనానికి మాత్రం ఫ్యాన్సీ నంబర్ (Fancy Number Plates) ఉండాలనుకుంటున్నారు వాహనదారులు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. దీంతో వీటి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఒక్కో నంబర్ లక్షల రూపాయలు పలుకుతోంది. ఎంతైనా చెల్లించి తమకు కావాల్సిన దానిని వాహనదారులు సొంతం చేసుకుంటున్నారు. నంబర్లు ప్రత్యేకంగా ఉండాలనుకోవడం, వీటిని అదృష్ట సంఖ్యలుగా భావించడం వంటి కారణాలతో వీటికి ప్రజల్లో భారీగా డిమాండ్ ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రారంభమైన 'టీజీ' రిజిస్ట్రేషన్- ఫ్యాన్సీనెంబర్లతో మొదటిరోజే కాసుల గలగల
స్కూటీ ధర రూ.లక్ష.. ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.కోటి పెట్టిన వ్యక్తి!