Varla Ramaiah demanded CBI inquiry: సీఎం జగన్ మీద రాయితో దాడిచేసిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. దాడిపై పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, ఆరోపించారు. కరెంట్ పోతే ప్రచారం ఆపేసి సీఎం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తారని వర్ల రామయ్య తెలిపారు. కానీ, అక్కడ పోలీసులు భద్రతా చర్యలను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
నేడు రాయి డ్రామా ఆడుతున్నాడు: రాష్ట్ర ప్రజలు జగన్ ని గద్దె దించుతున్నారని ఆయనకు తెలుసు కాబట్టే జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా, ప్రజల్ని భ్రమలో పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఐదు సంవత్సరాల క్రితం కోడికత్తి డ్రామా ఆడాడని ఆరోపించారు. తాజాగా నేడు రాయి డ్రామా ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా రాయి తగిలి కింద పడుతుంది గానీ, పక్కవాడికి కూడా తగలడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేసింది వీడే అని ఒక అమాయకుడిని చూపించి, అతన్ని కోడికత్తి శీనులా జైల్లో మగ్గబెడతారని ధ్వజమెత్తారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
సీఎం జగన్‌పై దాడి ఘటన - వివరాలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం - EC ON JAGAN INCIDENT
సీఎం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు: జగన్మోహన్‌రెడ్డి డ్రామాలకు జనం మోసపోవద్దని పేర్కొన్నారు. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటన జరగబోతోందని వైసీపీ నేత శ్రీధర్‌రెడ్డి ముందే చెప్పారని వర్ల గుర్తుచేశారు. శ్రీధర్ రెడ్డికి ముందే ఎలా తెలుసో పోలీసులు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. దుండగుల దాడి అనుకుని చంద్రబాబు ఖండించారని, అది దాడి కాదు. డ్రామా అని తెలిసి సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు. సీఎం ప్రచారంలో కరెంటు పోతే కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటారని, కరెంట్ పోతే ప్రచారం ఆపేసి సీఎం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. కానీ అక్కడ పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేశ్‌పై ఆరోపణలు: జగన్‌పై రాయి పడటం.. అతి చిన్న స్టేజ్ డ్రామా అని ఎద్దేవా చేశారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే వైసీపీ నేతలు ధర్నా చేశారని, వారికి పది నిమిషాల్లోనే ప్లకార్డులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. ఇలా జరుగుతుందని కొందరు నేతలు, పోలీసులకు తెలుసని వర్ల ఆరోపించారు. దాడి ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు, లోకేశ్‌పై ఆరోపణలు చేశారని తెలిపారు. ఘటన ఎలా జరిగిందో జగన్, సజ్జలకు తెలుసని పేర్కొన్నారు. షర్మిల, సునీతకు ప్రాణాపాయం ఉందని జాగ్రత్తగా ఉండాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.
సీబీఐ విచారణ జరిపించాలి : విజయవాడ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో జరిగిన ఘటన వైసీపీ కుట్రేనని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. 2019లో బాబాయి హత్య, కోడికత్తిని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధిపొందిన జగన్ మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ దాడికి సంబంధించి రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ఛీఫ్, విజయవాడ సీపీ బాధ్యత వహించాలన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఉమ డిమాండ్ చేశారు.
దాడుల సంస్కృతికి పేటెంట్ రైట్స్ జగన్ రెడ్డివే : ముఖ్యమంత్రిపై గులకరాయి దాడి డ్రామా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఆరోపించారు. రాజకీయాల్లో దాడుల సంస్కృతికి పేటెంట్ రైట్స్ జగన్ రెడ్డివే అని ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి డ్రామాలు, ఇప్పుడు గులక రాళ్ల దాడులు అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో కరెంటు కోతలు, కారు చీకట్లు డ్రామాలో భాగమే అని మండిపడ్డారు. దాడి జరిగిన క్షణాల్లోనే పోస్టర్లు, బ్యానర్లతో వైసీపీ నేతల ధర్నాలు డ్రామాలో భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్లు ఎలా సాధ్యమయ్యాయని నిలదీశారు. నిన్న జరిగిన గులకరాయి డ్రామాలోని 10 ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన తమ ప్రశ్నలకు జవాబిచ్చే ధైర్యం వైసీపీ నేతలకుందా అని సవాల్ విసిరారు. ఈ డ్రామా వ్యవహారంపై ఎన్నికల కమిషన్ సీబీఐ లేదా ఎన్ఐఏతో తక్షణమే లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్‌పై దాడి ఘటనపై కేసు నమోదు - టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో విచారణ - attack on ap cm ys jagan